ముంబై: మహారాష్ట్ర కేబినెట్ మంత్రి మంత్రి ఏక్‌నాథ్ షిండేపై శివసేన చర్యలు చేపట్టింది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియమించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా 12 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞాతంలోకి వెళ్లిన షిండే.. గుజరాత్‌లోని మెరిడియన్ హోటల్‌లో మకాం వేశారు. ఈ క్రమంలో హోటల్ వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి కారును క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. నేడు షిండే మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్ షిండే?
ఆ ప్రసక్తే లేదు: ఎన్సీపీ
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఈ సమస్యను శివసేన అంతర్గత విషయంగా అభివర్ణించారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొంటారని ధీమా వ్యక్తం చేసిన శరద్ పవార్.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై విశ్వాసం ఉందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించేందుకు జరుగుతున్న మూడో ప్రయత్నమిది అని అన్నారు. ఇది కూడా ఫలించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే భాజపాతో జట్టుకట్టే ప్రసక్తే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment