మాయావతి గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణం కావొచ్చు’’ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓ వైపు పార్టీల్లో చేరికలు, మరోవైపు నేతల మాటల యుధ్ధాలు, ఇంకోవైపును ప్రజలను ఆకట్టుకునేలా ప్రకటిస్తున్న హామీలతో ఎన్నికల కోలాహలం పెరిగినా.. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఎక్కడా పెద్దగా కనబడకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిధ్దమవుతుండగా, పార్టీ ప్రచారాలకు మాయావతి గైర్హాజరు అవుతుండటం, పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా, ఆమె మౌనం వీడకపోవడం పార్టీ క్రియాశీలక నేతలకు అంతుపట్టకుండా మారుతోంది. మాయావతి మౌనం నేపథ్యంలో ఆమెకు తొలినుంచి అండగా ఉంటూ వస్తున్న దళితవర్గాలు బీజేపీ, ఎస్పీ వైపుకు చూస్తుండటం ఆ పార్టీల గెలుపోటములను నిర్దేశించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
‘మాయ’ పనిచేయట్లేదా!
బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగుమార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గానూ 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టు ఉంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకుపోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓటినప్పటికీ ఆమె వచ్చిన 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు. 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం19.3 శాతం ఓట్లనే రాబట్టుకుంది.
అప్పటినుంచి పార్టీ కార్య్రమాలపై పెద్దగా ఆసక్తి చూపని మాయావతి ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయ సమస్యలపై గొంతు విప్పుతూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దళితులు కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే మాయావతి మాత్రం పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వర్గాలన్నీ పక్క పార్టీలకు మళ్లాయి. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో బీఎస్పీకి దళితులు దూరమయ్యారు. ఇదీగాక మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ కులాల భద్రత, నివాసం, ఉపాధికి పెద్దగా చేసిందేమీ లేదని, దళితులపై జరిగిన అఘాయిత్యాలను ఆపడంలో విఫలమయ్యారని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఎస్సీ వర్గాల్లో మాయావతి ప్రభ తగ్గిందని, అదీగాక ఆమె గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చదవండి: (రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..)
ఎవరికి కలిసొస్తుందో...
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ బలహీనంగా కనబడుతుండటంతో దళిత వర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీలో పలుకుబడి గల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విభిన్న సంక్షేమ పథకాలను ముందుపెట్టి దళిత ఓట్లను ఆకర్షించడంతో పాటు వారిని హిందూత్వ గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2017 ఎన్నికల్లో 84 ఎస్సీ నియోజకవర్గాలకు గానూ బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. తిరిగి అదే స్థాయి సీట్లను రాబట్టుకునేందుకు దళిత కులాలన్నింటినీ కలుపుకుపోయే ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 75 జిల్లాల్లో దళితుల అభ్యున్నతికై నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు పార్టీకి అదనపు బలం చేకూర్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయనని, ఎస్సీ మేధావుల సమావేశాల్లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓటర్ల సమీకరణ కోసం దళిత నాయకులను స్వాతగించిన అఖిలేశ్, వారిని రిజర్వ్‌డ్ స్థానాల్లో నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ ప్రభుత్వోద్యోగులను సంతోషపెట్టడానికి తిరిగి అధికారంలోకి వస్తే, ఎస్సీ అధికారులే తన ప్రభుత్వాన్ని నడిపిస్తానని అనేకసార్లు ప్రైవేట్ సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది బీఎస్పీ పార్టీ, ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు... ఎస్పీలో చేరిపోయారు. వారిలో ఇంద్రజీత్ సరోజ్ కౌశాంబి, డాక్టర్ కేకే గౌతమ్, మిథాయ్‌లాల్ భారతి, త్రిభువన్ దత్తా, మహేష్ ఆర్య, సర్వేశ్ అంబేద్కర్, వీర్ సింగ్ జాతవ్, తిలక్ చంద్ర అహిర్వార్, ఫెరాన్ లాల్ అహిర్వార్, అనిల్ అహిర్వార్, విద్యా చౌదరి, రమేష్ గౌతమ్, యోగేష్ వర్మ వంటి వారున్నారు.
గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన సీట్లు, ఓట్లు..
ఎన్నికలు గెలిచిన సీట్లు ఓట్ల శాతం
2002 98 23.06
2007 206 30.43
2012 80 25.97
2017 19 22.23
Comments
Please login to add a commentAdd a comment