సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆ పార్టీ నిర్వహిస్తోన్న ‘మహా జన సంపర్క్ అభియాన్’కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలోనూ పర్యటించే అవకాశాలున్నాయి.
ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న తెలంగాణతో పాటు రాజ స్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రలలో ప్రధానిమోదీ ర్యాలీలు ఉండేలా పార్టీ పెద్దలు ఇది వరకే కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఆ మేరకు జూన్ నెలాఖరులోగా రాష్ట్రంలో భారీ ర్యాలీ ఉండవచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మెగా ర్యాలీ నిర్వహణ, లోక్‌సభ నియోజకవర్గ ఎంపికపై ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు కోరినట్లుగా సమాచారం. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలున్న లోక్‌సభ పరిధిలోనే
దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలోని 80 కోట్ల మందికి చేరువయ్యే లక్ష్యంతో బుధవారం నుంచి బీజేపీ మహా జనసంపర్క్ కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 51కి పైగా భారీ ర్యాలీలు, 500కు పైగా చోట్ల బహిరంగ సభలు, 500కి పైగా లోక్‌సభ, 4000 విధానసభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలు నిర్వహించి 5 లక్షలకు పైగా విశిష్ట కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే 31న నుంచి జూన్ 30 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని రాజస్తాన్ నుంచి ప్రధాని ప్రారంభించారు. నెల రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ 12 ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఈ ర్యాలీలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట మోదీ ర్యాలీ, బహిరంగ సభ ఉండే అవకాశాలున్నాయని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపారు. చాలామంది నేతలు హైదరాబాద్ లోక్‌సభ పేరు సూచిస్తున్నా, అక్కడ పార్టీ బలంగానే ఉన్న దృష్ట్యా, గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీ చేపట్టేలా పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్రపథకాల లబ్ధిదారులతో మమేకమయ్యేలా..
దక్షిణాదిలో పార్టీకి పట్టున్న కర్ణాటక చేజారిన నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధికంగా ఫోకస్ చేస్తోందని, ఈ నేపథ్యంలో మోదీ సహా ఇతర నేతల ర్యాలీలు ఉండేలా పార్టీ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీలు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నటు తెలుస్తోంది ఇక ప్రత్యక్ష ప్రయోజనాలను అందించిన పీఎం కిసాన్ నిధి, ముద్రలోన్, అన్న యోజన వంటి 10 కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మమేకం అయ్యేలా ఆ ర్యాలీలు, సభలు నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా వైఎస్సార్‌సీపీ పరుగులు’
Comments
Please login to add a commentAdd a comment