
సాక్షి, హైదరాబాద్: సమస్యలే ఏజెండాగా ముందుకు వెళితేనే ప్రజలు ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, తీర్మానాలు చేసి కూర్చుంటే ఫలితం రాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీడబ్లు్యసీ సభ్యులను ఉద్దేశించి ఆయన శనివారం రాత్రి మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాలు ఏ విధంగా అణచివేతకు గురవుతున్నారో వారి సమస్యలను తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కేడర్ బేస్డ్ అన్న ఆలోచనతోనే ఉంటే కష్టమని, ప్రజామూవ్‌మెంట్‌తోనే వెళ్లాలని చెప్పారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా బీజేపీ విద్వేష రాజకీయాలను స్పష్టంగా చెప్పగలిగామని, విద్వేషంతో దేశాన్ని ఎలా ప్రమాదంలోకి నెడుతున్నారన్న అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారు ఆదరించారని రాహుల్‌గాంధీ తన అనుభవాలను వివరించారు. కర్ణాటక ఎన్నికలకు ఆరు నెలలుపాటు తీవ్రంగా శ్రమించినట్టు తెలిపారు.
అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకున్నదని, ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, అధికారంలోకి వస్తే ఏఏ వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తామో స్పష్టం చేయడం, నాయకులు సమష్టిగా పనిచేయడం వల్ల విజయం సాధ్యమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, అయితే విజయం సాధించడమే కాక, దేశానికి ఏం చేయాలన్న అంశంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుందామని ఆయన సూచించారు.