సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నడుమ విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నగరంలో నేతలు హాట్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నువ్వానేనా అనే రీతిలో ఇరు పార్టీల నేతలు నోటికి పనిచేప్తున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చగొట్టే ప్రసంగాలతో, విద్వేశపూరిత వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య రాకతో మొదలైన గ్రేటర్ రాజకీయ వేడి నేటికి తారాస్థాయికి చేరింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత మంగళవారం హైదరాబాద్ నగరంలో పర్యటించిన సూర్య.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. (అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్)
అంతేకాకుండా పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాతో పోల్చారు. దేశ విభజన సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని జిన్నా డిమాండ్ చేశారని, ఒవైసీ కూడా అదే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వలసవచ్చిన ముస్లింలు పాతబస్తీలో అక్రమంగా నివాసముంటున్నారని ఆరోపనలు గుప్పించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రొహింగ్యాలు, పాకిస్తాన్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ మద్దతు దారులే ఎంఐఎం పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘అక్బరుద్దీన్, అసదుద్దీన్ సోదరులకు నేను ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇది నిజాం నవాబు పాలన కాదు. హిందు హృదయ సామ్రాట్ నరేంద్ర మోదీ సామ్రాజ్యం’అంటూ విరుచుకుపడ్డారు. (అదే జరిగితే.. దారుసలాంని కూల్చుతాం)
పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్
ఇక తేజస్వీ సూర్య విమర్శలపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో పాకిస్తాన్, రొహింగ్యా ఓటర్లు ఉంటే కేంద్రహోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే భాగ్యనగరంలోని రొహింగ్యాలకు షెల్టర్ ఇచ్చారని ఒవైసీ గుర్తుచేశారు. మరోవైపు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌లపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పీవీ, ఎన్టీఆర్ ఘాట్స్‌ను కూల్చివేస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో అలజడి సృష్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సంజయ్ కామెంట్స్ తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ హాట్ టాపిక్‌గా మారాయి. (పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్)
మరోవైపు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకుల ప్రసంగాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలు, మేనిఫేస్టోలు తయారుచేసి, ఓటర్లను ఆకర్శించాలే గానీ ఇలా రెబ్బగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలుకుతున్నారు. మొత్తానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాజధానిలో వేడిపుట్టిస్తున్నాయి. చివరికి గ్రేటర్ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
తేజస్వీపై కేసు నమోదు..
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పై ఓయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించడాని ఓయూ రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంపస్‌లో విరుద్ధంగా సభ నిర్వహించారంటు ఫిర్యాదులో పేర్కొన్నారు. రిజిస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు పెట్టి బీజేపీ ని ఆపలేరని, ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టండి అంటూ ట్విటర్‌లో తేజస్వి సవాల్ విసిరారు. ఎన్ని కేసులు పెడితే బీజేపీ అంత బలంగా తయారు అవుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment