
చెన్నై : మనుస్మృతి చెలామణిలో లేనప్పుడు దానిపై చర్చ అవసరం లేదని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ అన్నారు. లోక్‌సభ ఎంపీ, విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) వ్యవస్థాపకుడు థోల్ తిరుమవళ్వన్ వీడియో క్లిప్ వైరల్ కావడంతో తమిళనాడులో మనుస్మృతి వాగ్వాదం చెలరేగింది. తిరుమవళ్వన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా, హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే తాజా వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. మనుస్మృతి ప్రస్తుతం చెలామణిలో లేనందున దాని గురించి అనవసరమన్నారు. మనుస్మృతి సమాజానికి ప్రవర్తనా నియమావళిని చూపించే పురాతన గ్రంథంమని, ఇది కుల వ్యవస్థ ప్రతిపాదకుడిగా విమర్శలకు గురైందని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాలు చెప్పడం నా రాజకీయ వ్యూహమని పేర్కొన్నారు. తమిళనాడులో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. ఎంఎన్‌ఎం పార్టీ రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను చేయబోయే మొదటి పని లోక్‌పాల్ చట్టం తీసుకురావడమని వివరించారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ డీఎంకేతో కలిసి పోటీ చేస్తామని వస్తున్న వార్తలు అవాస్తమనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment