సాక్షి, హైదరాబాద్: వాస్తవాలను దాచిపెట్టిన నలుగురు పిటిషనర్లకు హైకోర్టు రూ.లక్ష భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని సర్వే నంబర్ 57లో 2,432 చదరపు గజాల తమ స్థలంలో టీఎస్పీడీసీఎల్ జోక్యం చేసుకుని, ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందంటూ మల్లేష్ మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు 2013లో నాటి జిల్లా కలెక్టర్ 300 గజాల జాగా కేటాయించారని టీఎస్పీడీసీఎల్ కౌంటర్‌లో తెలిపింది. అక్కడేమీ ఇల్లు లేదని, పిటిషనర్ల అధీనంలో స్థలం ఉందని వివరించింది.
గతంలో సివిల్ కోర్టులో వేసిన దావాను పిటిషనర్లు వెనక్కు తీసుకున్నారని చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. సివిల్ కోర్టులో దావా వేసిన విషయాన్ని హైకోర్టుకు చెప్పలేదని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యథాతథస్థితి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెండు వారాల్లో రూ.లక్ష చెల్లించాలని తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment