సాక్షి, తిరుపతి: సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని కామెంట్స్ చేశారు.
నేడు నగరిలో వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సహా పలువురు పార్టీ నేతలు, కార్తకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగరి నియోజకవర్గంలో భవిష్యత్తు కార్యచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం, నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుంది. కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైఎస్సార్‌సీపీ ఓడిపోయింది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.
సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసింది. పచ్చ బట్టలేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నేడు నరకం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ నాడు-నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది. రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్‌గా చేసింది. వైఎస్ జగన్‌ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు. నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా? అంటు బాధపడుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో నేను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి, రాష్ట్రంలో వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడకండి.. రాబోయేది మన ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. విద్యుత్ బిల్లుపై రేపు నిరసన ఉంటుంది. జనవరిలో విద్యార్థులకు అండగా పోరాడాలి. పచ్చ చానల్స్ అబద్దాలు చెప్పడం తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు అందరికీ తెలియజేయాలన్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వం, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేడు మొదటి సర్వసభ్య సమావేశం ఇది. రోజా నగరికి రాజా లాంటి వ్యక్తి. రోజా కొమ్మకే కాదు, పువ్వులు కూడా ముళ్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నాయకురాలు. వైఎస్ జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా. అత్యధిక మెజారిటీతో రోజాను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. నగరి అభివృద్ధి చేసిన వ్యక్తి రోజా.. అందుకే గెలిపించాలని కోరుతున్నాను. ప్రపంచంలో వైఎస్ జగన్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనో గొప్ప వ్యక్తి. ఎవరో పనికిమాలిన వారి కింద పని చేయడం కంటే.. ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్సార్‌సీపీలో ఉండటమే ఎంతో మేలు. ఏ ఒక్క కార్యకర్తలో చిన్న భయం ఉన్నా తొలగించుకోండి. కూటమి, తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి.. నెరవేర్చని మోసపు ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెలికిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.
ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు. వైఎస్ జగన్ కోసం పోరాడే వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. మనమందరం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఏ ఒక్కరికి కష్టం ఇచ్చినా కరుణాకర్ రెడ్డి, మేము అండగా ఉంటామన్నారు.
మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ..‘భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమ నాయకుడు. టీటీడీ చైర్మన్‌గా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రజల అందరు పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈవీఎంల స్కామ్ వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఈవీఎంల స్కామ్ చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీకి ఓటమి ఎదురైంది. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అప్పుల మీద అప్పులు చేస్తోంది. నగరిలో రోజాను గెలిపించండి. మీకు మేము అండగా ఉంటాం’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment