యడ్లపాడు(పల్నాడు జిల్లా): రోడ్డు దాటుతున్న ఫోర్‌వీల్ ఆటోడ్రైవర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండల కేంద్రంలో హైవే బైపాస్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి మండలం కూచిపూడిపల్లి గ్రామానికి చెందిన బత్తుల యాగయ్య ఫోర్‌వీల్ టాటాఇంట్రా వాహనంలో గుంటూరు నుంచి కనిగిరికి ఇంటి సామగ్రి లోడుతో ఆదివారం రాత్రి బయలుదేరాడు. మండలంలోని తిమ్మాపురం హైవే బైపాస్ ఎక్కగానే ఫోర్‌వీల్ వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొంది. దీంతో కారు యజమానితో డ్రైవర్ యాగయ్య మాట్లాడి తిరిగి తన వాహనం వద్దకు వస్తున్న క్రమంలో.. అదే సమయంలో అటువైపు దూసుకువచ్చిన గుర్తు తెలియని వాహనం యాగయ్యను ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయాలైన యాగయ్య (23) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మృతుని తల్లిదండ్రులు ఏడుకొండలు, వరమ్మ, బంధువులతో యడ్లపాడుకు చేరుకున్నారు. తల్లి వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో కనిగిరి యువకుడు దుర్మరణం