
12వ పీఆర్సీకి కమిషన్‌ను నియమించాలి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుందని, 11వ వేతన సవరణ ముగిసి 21 నెలల అయినా 12వ వేతన సవరణ కమిషన్ వేయకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొందని ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నుపాటి మంజుల అన్నారు. 30 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ వేతన సవరణ కమిషన్ ను తక్షణమే నియమించాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కే.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ సీపీఎస్, జీపీఎస్ లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, 2003 డీఎస్సీ వారికి కేంద్ర ప్రభుత్వ మెమో 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే చెల్లించాలన్నారు. 70 ఏళ్ల వయస్సు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలు చేయాలన్నారు. పంచాయతీ రాజ్ యాజమాన్యంలో కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని, ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ కు సంబంధించిన 72 ,73 ,74 జీవోలను అమలు చేయాలని కోరారు. 117 జీవోను రద్దుచేసి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా అమలు చేయాలని, ఉపాధ్యాయుల పదోన్నతుల సీనియర్ జాబితాలో ఉన్న తప్పుల తడకలు సవరించి మెరిట్ కం రోస్టర్ ప్రకారం రీ ఆర్గనైజ్ చేయాలన్నారు. బదిలీలకు సంబంధించి బాలికలు ఉన్న పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలని, 50 సంవత్సరాలు అనే నిబంధన తొలగించి ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని, మెడికల్ రియింబర్స్‌మెంట్ బిల్లులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. జెడ్పీ పీఎఫ్ లోన్స్, క్లోజర్స్ విషయంలో సీఎఫ్‌ఎంఎస్ పంపించడంలో ఉన్న జాప్యాన్ని తొలగించాలన్నారు. ఎస్‌ఎస్‌సీ స్పాట్ నుంచి 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్డర్స్ పంపారని, అలాంటి వారిని సంబంధిత హెడ్మాస్టర్ రిలీవ్ చేయరాదని తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్.ఎం.డి.రఫి, ఫ్యాప్టో ప్రకాశం జిల్లా నాయకులు వి.మాధవరావు, డి.జయరావు, వై.వెంకట్రావు, ఎస్.కె.అబ్దుల్ హై, వి.జనార్దన్ రెడ్డి, బి. వెంకట్రావు, రాష్ట్ర సంఘ బాధ్యులు కే.శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాసులు, పి.వెంకట్రావు, జీవీకే కీర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తమ సమస్యలుపరిష్కరించాలని డిమాండ్