మరో ఇద్దరికి గాయాలు
పొన్నలూరు: ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ముత్తరాసుపాలెం, ముప్పాళ్ల రోడ్డు మార్గంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాలు మేరకు..ముత్తరాసుపాలెం గ్రామానికి చెందిన సర్వేపల్లి వెంకయ్య(50) సర్వేపల్లి వెంకట్రావు, లేతవడ్ల రామకృష్ణ ముప్పాళ్ల సమీపంలోని పాలేరులో ఇసుక లోడుకి ట్రాక్టర్‌లో బయలుదేరారు.
రామకృష్ణ ట్రాక్టర్ నడుపుతుండగా మిగిలిన ఇద్దరు అతని పక్కనే ఇంజన్‌లో కూర్చున్నారు. ఈ క్రమంలో కొంత దూరం వెళ్లిన తరువాత మార్గమధ్యలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ట్రాక్టర్ ఇంజన్‌లో కూర్చున్న వెంకయ్య భయపడి కిందకు దూకడంతో తారు రోడ్డుపై పడి తలకి బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే రామకృష్ణ, వెంకట్రావులు గుంతలో పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108కి సమాచరం ఇవ్వడంతో వారు వచ్చి క్షతగాత్రులను చికిత్స కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అలాగే వెంకయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో ట్రాక్టర్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై అనూక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.