
నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
కొమరోలు: ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని బాలిరెడ్డిపల్లె గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దుండగుడి దుశ్చర్యతో ఉలిక్కిపడి లేచిన ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేసి చోరీ విషయాన్ని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఒంగోలు టౌన్: ప్రజలు వేసవి వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్‌ఓ ఛాంబర్‌లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కాన్ఫరెన్స్ వివరాలను డీఎంహెచ్‌ఓ వెల్లడించారు. స్కూలు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, సికిల్ సెల్ అనీమియా, వేసవి వ్యాధుల గురించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పలు సూచనలు చేసినట్లు తెలిపారు. గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్య సేవలను అందించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడే వారిని సకాలంలో గుర్తించి వైద్య అందిస్తే మాతృమరణాలు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. 5 ఏళ్ల లోపు బరువు తక్కువగా ఉన్న చిన్నారులను న్యూట్రీషన్ రీ హాబిలేషన్ సెంటర్‌కు రెఫర్ చేయడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్టవేయవచ్చన్నారు. వడదెబ్బ నివారించుటకు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మజ, డీపీఎంఓ డాక్టర్ వాణిశ్రీ, శ్రవణ్, శ్రీవాణి, హేమంత్, చల్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.