300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌ | - | Sakshi

300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

Apr 4 2025 1:05 AM | Updated on Apr 4 2025 1:05 AM

300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

బేస్తవారిపేట:

కూటమి ప్రభుత్వంలో రేషన్‌ బియ్యం అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. గురువారం బేస్తవారిపేట జంక్షన్‌లో హైవే రోడ్డు పక్కన ఉన్న రైస్‌ మిల్లులో పాలిష్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ సీజ్‌ చేశారు. రైస్‌ మిల్లులో 300 క్వింటాళ్ల పాలిష్‌డ్‌ రేషన్‌ బియ్యాన్ని లోడ్‌ చేసుకున్న లారీ ఇక్కడి పెట్రోల్‌ బంకులో డీజీల్‌ కొట్టించుకుని వెళ్తుండగా సబ్‌ కలెక్టర్‌ అదుపులోకి తీసుకున్నారు. లారీలో రేషన్‌ బియ్యం బస్తాలను కిందకు దింపి పరిశీలించారు. తెల్లటి సంచులకు ఇంపోర్టర్‌ వియత్నాం అడ్రస్‌తో, ఎక్స్‌పోర్టర్‌ అడ్రస్‌ హేమరాజ్‌ ఇండస్ట్రీస్‌ ప్త్రెవేట్‌ లిమిటెడ్‌, కోల్‌కతా, వెస్ట్‌బెంగాల్‌ పేరుతో ట్యాగ్‌లు వేశారు. లారీని పట్టుకున్న విషయం తెలుసుకున్న యజమానులు హుటాహుటిన సబ్‌ కలెక్టర్‌ వద్దకు చేరుకున్నారు. నంద్యాలలో జనవరిలో నిర్వహించిన వేలంలో రేషన్‌ బియ్యం కొన్నామని, బేస్తవారిపేటలోని రైస్‌మిల్లుకు తీసుకొచ్చి పాలిష్‌ చేసి ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నామని వ్యాపారులు చెప్పడం గమనార్హం. దీనిపై స్పందించిన సబ్‌ కలెక్టర్‌.. ఎన్ని బియ్యం కొన్నారు, ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్లు ఎక్స్‌పోర్ట్‌ చేశారు, స్టాక్‌ ఎక్కడ పెట్టారు, బ్యాగ్‌లపై అంటించిన అడ్రస్‌లకు బియ్యం పంపకుండా మరో చోటకు ఎందుకు తరలిస్తున్నారు, బియ్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు అవుతున్నా ఎందుకు ఎక్స్‌పోర్ట్‌ చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించడంతో యాజమాని నీళ్లు నమిలాడు. నంద్యాల నుంచి లారీలో బియ్యం తెస్తే గాజులపల్లె, తాటిచర్ల మోటు వద్ద చెక్‌ పాయంట్లలో తీసుకున్న రశీదులు ఎక్కడ?, రేషన్‌ బియ్యం మిల్లుకు తరలించేటప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో లారీని సీజ్‌ చేసి కంభంలోని రేషన్‌ గోడౌన్‌కు తరలించాలని తహసీల్దార్‌ జితేంద్రకుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ రామనారాయణరెడ్డిని సబ్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్‌ఐ సల్మాన్‌, ఆర్‌ఐ కాశయ్య, వీఆర్వో ఉన్నారు.

బేస్తవారిపేటలోని ఓ రైస్‌ మిల్లులో పాలిష్‌ చేసి అక్రమంగా రవాణా

లారీని సీజ్‌ చేసిన మార్కాపురం సబ్‌కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌

కంభం రేషన్‌ గోడౌన్‌కు బియ్యం తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement