
పొలాలు నోరెళ్లబెట్టి!
పాలకులు ఎండబెట్టి..
మర్రిపూడిలో కరువు రక్కసి ఉగ్రరూపం...
మర్రిపూడి: చుక్కనీరు లేని ఇరిగేషన్ చెరువులు, ఒట్టిపోయిన బోర్లు, 500 అడుగులు లోతుకెళ్లినా కనిపించని నీరు, కనుచూపు మేర అంతా బీడే. ఈ విధంగా మర్రిపూడి మండలంలో కరువు రక్కసి ఉగ్రరూపం దాల్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని 13 ఇరిగేషన్ చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో పిచ్చిచెట్లు పెరిగిపోయాయి. దీంతో ఆయకట్టు అంతా బీడుభూములను తలపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటితడులు లేక సాగుచేసిన పంటలన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. మండలంలో 500పైచిలుకు బోర్లు ఉంటే అందులో 80 చేతిపంపులు పూర్తిగా ఒట్టిపోయాయి. ఎక్కువ శాతం బోర్లు తప్పుపట్టి పనికిరాకుండా ఉన్నాయి. వ్యవసాయ బోర్లు 500 అడుగుల్లోతు వేసినా చుక్క నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో వాగులు, వంకలు, కుంటల్లో చుక్కనీరు లేక పశువులు నీటికి తీవ్ర ఇక్కట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మున్ముందు పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని మండల వాసులు వాపోతున్నారు.
– ఖరీఫ్‌లో కంది 19,086 ఎకరాల్లో సాగుచేయాల్సి ఉండగా, 21,200 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే సజ్జ 842 ఎకరాలకుగానూ 766 ఎకరాలు, వాణిజ్య పంటలు 1200 ఎకరాలకుగానూ 676 ఎకరాల్లో సాగుచేశారు. వ్యవసాయ బోర్లు ఒట్టిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. కొందరు వేలకు వేలు ఖర్చు చేసి ఆరుతడులు ఇస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో తెగుళ్లు విజృంభించాయి. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మిర్చి ధరలు లేకపోవడంతో కోత కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు.

పొలాలు నోరెళ్లబెట్టి!