
ప్రభుత్వ బోరు.. టీడీపీ నేత చేనుకు నీరు!
కొనకనమిట్ల: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో డీప్ బోరు నీటిని స్థానిక టీడీపీ నాయకుడు తన సొంతానికి వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. ఎంపీడీఓ కార్యాలయ వెనుక భాగంలోని డీప్ బోరు నుంచి టీడీపీ నేత సాగు చేస్తున్న పొగాకు తోటకు నేరుగా పైపులు పరిచి నీరు వాడుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా ఈ తంతు సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. డీప్ బోర్ సమీపంలో ఎంపీడీఓతోపాటు తహసీల్దార్ కార్యాలయం, రైతు సేవా కేంద్రం, వ్యవసాయాధికారి కార్యాలయం ఉన్నా టీడీపీ నేతను ఎవరూ ప్రశ్నించలేదు. పొగాకు తోటకు నీరు అత్యవసరమైన పక్షంలో అధికారుల అనుమతి తీసుకోవాలి కానీ ఇష్టారీతిగా డీప్ బోరును ఎలా వినియోగించుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓను వివరణ కోరగా.. డీప్ బోరును వినియోగించుకుంటున్న విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.