
అగ్రహారం భూములపై రాబందులను వాలనివ్వం
ఒంగోలు టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన అగ్రహారం భూముల్లో రాబందులను వాలనిచ్చేదిలేదని, అగ్రహారం భూములను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలోని వేలాది మంది ఇళ్లులేని నిరుపేదలకు అగ్రహారం భూముల్లో ఇంటి స్థలాలిచ్చేంత వరకు ఎర్రజెండాలతో పోరాటాం కొనసాగిస్తామని చెప్పారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అగ్రహారం భూములను పార్టీ నాయకులు, లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ఒంగోలులో 20 ఏళ్ల క్రితం ఇంటి స్థలాలు పంపిణీ చేశారని, ఇప్పటికీ ఒక్కో ఇంట్లో ఏడుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారని తెలిపారు. అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారని చెప్పారు. ఏడేళ్ల క్రితం నిర్మించిన టిడ్కో ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నారు. లేకపోతే టిడ్కో ఇళ్లపై ఉద్యమం చేస్తామని ప్రకటించారు.
అగ్రహారం భూములపై పేదలకే హక్కు...
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ప్రసంగిస్తూ అగ్రహారం భూములపై పేదలకే హక్కుందన్నారు. అగ్రహారం భూములను కొల్లగొట్టాలని చూస్తే ఎర్రజెండాలు పాతి పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. అగ్రహారం భూముల్లో భరోసా పత్రాలిచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. అధికారం పోగానే స్వలాభం కోసం పార్టీ మారారే తప్ప పేదలకు ఇచ్చిన భూముల గురించి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఒంగోలులో పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకులు కె.వీరారెడ్డి, శ్రీరాం శ్రీనివాస్, ఆర్.వెంకటరావు, వడ్డే హనుమారెడ్డి, ఆర్.రామకృష్ణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్.లక్ష్మి, ముత్తని అంజయ్య, ఎన్.మురళి, ఎం.విజయ, బాలకోటయ్య, ప్రభాకర్, గద్దల రవి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఆ భూములు పంచాల్సిందే
ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చకుంటే పోరాటం
భూములను పరిశీలించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ