
పొగాకు రైతులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి
కొండపి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల పట్ల మొద్దు నిద్ర విడనాడి పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలోని జెండా చెట్టు సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు కొనుగోలు ప్రారంభం నుంచి రైతులకు ఆశించిన మేర బోర్డు వారు కొనుగోలు ప్రారంభించలేదని అన్నారు. ప్రస్తుత ధరలు ఏమాత్రం రైతులకు గిట్టుబాటు కల్పించేలా లేవని అన్నారు. పొగాకు కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాల్లో కేజీ రూ.300 పైగా ధర పలుకుతుంటే, మన రాష్ట్రంలో సరాసరి రూ.250 పైగా పలుకుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన వేలంలో ఎక్కువగా నో బిడ్స్ కనబడుతున్నాయని, రైతులు ఏదో ఒక ధరకు ఇచ్చేలా చేసే ప్రయత్నంలో పొగాకు బోర్డు వారు ఉన్నారని అన్నారు. పొగాకు ధరలు పెరుగుతాయని రైతులు ఎదురుచూస్తుంటే ధరలు మాత్రం రోజురోజుకూ దిగజారిపోతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర కేజీ రూ.300 పైగా ఉంటే రైతులు అప్పుల ఊబిలో పడకుండా ఉంటారని, ఇప్పటికై నా ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిస్థితి చేయి దాటకముందే ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి పొగాకు రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయకముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లు తీసుకొచ్చి పొగాకు ధరలను స్థిరీకరించారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్ సొసైటీ ద్వారా రూ.200 నుంచి రూ.300 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఆరికట్ల కోటిలింగయ్య, వైస్ ఎంపీపీ రావులపల్లి కోటరాజు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు షేక్ వన్నూరు, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు, యువజన విభాగ అధ్యక్షుడు గంగాధర్, మండల సీనియర్ నాయకులు బొక్కిసం సుబ్బారావు, బచ్చలకోటు, మండవ మాలకొండయ్య, దివి శ్రీనివాసరావు, పర్చూరి శ్రీనివాసరావు, మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, గౌరెడ్డి రమణారెడ్డి, నెన్నూరు పాడు రమణారెడ్డి, పరుచూరి సుబ్బయ్య, మోపర్తి నారాయణ, ఆరికట్ల హరినారాయణ, కోడిపిల్ల ప్రసాద్, శేషు, రాజబాబు, సాంబశివరావు, వినోద్, మహేష్, నజీర్, కోర్నేలు, యాకోబు, సుల్తాన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలి పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సురేష్