
చట్టసభల్లో బీసీలకు వైఎస్ జగన్ ప్రాధాన్యత
కొండపి: బీసీల రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ హయాంలో సముచిత ప్రాధాన్యం దక్కిందని, బీసీను బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్‌గా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు ఆధ్వర్యంలో కొండపిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీసీల్లోని అన్ని ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సామాజిక న్యాయాన్ని సాకారం చేయడమే కాకుండా బీసీల్లో అత్యధిక మందిని చట్టసభలకు పంపిన అభినవ పూలే వైఎస్ జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను బూటకపు హామీలతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారం చేపట్టి ఏడాదవుతున్నా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని, బీసీలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ పేరుతో సమాజంలో అరాచకత్వాన్ని ప్రేరేపిస్తుండటంతో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను టీడీపీ కీలుబొమ్మగా మార్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను ఉద్దేశపూర్వకంగా విస్మరించడమే కాకుండా మంత్రులు, నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని, కుటుంబ సభ్యులను కించపరుస్తూ కూటమి నాయకులు, ఐటీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్న తీరు జుగుప్సాకరమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని, ఒకరికి వెన్నుపోటు పొడిచి లాక్కున్నది కాదన్నారు. గత ఎన్నికల్లో 40 శాతం ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకుంటే మంచిదన్నారు. రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పూలే జయంతి సభలో మాజీ మంత్రి
ఆదిమూలపు సురేష్