
సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి
● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు వన్‌టౌన్: ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. స్థానిక మామడిపాలెంలో ఆధునికీకరించిన రెడ్డి హాస్టల్‌లోని కొన్ని విభాగాలను బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి హాస్టల్ కమిటీ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ తన భర్త సుబ్బారెడ్డి సంపాదించిన 10 రూపాయల్లో 9 రూపాయలు సమాజ సేవకే వెచ్చించేవారన్నారు. ఆయన బతికి ఉన్న సమయంలో రెడ్డి హాస్టల్‌ను సందర్శించిన సమయంలో హాస్టల్‌కు కొన్ని సౌకర్యాలు కల్పించాలని యోచించారన్నారు. ప్రస్తుతం తన భర్త చారిటబుల్ ట్రస్టు తరఫున వసతి గృహ విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు రూ.15 లక్షలు వెచ్చించి హాస్టల్‌ను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ హాస్టల్‌లో కిచెన్, డైనింగ్ రూం, సమావేశం గది, విద్యార్థులకు బెడ్లు, కొన్ని సివిల్ వర్క్స్ నిర్వహించామన్నారు. విద్యార్థులు పేదరికాన్ని మరిచి మంచిగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతస్థితికి చేరుకోవాలని కోరారు. మీరు గొప్పస్థాయికి వెళ్లిన తర్వాత మరికొంత మంది పేదలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆదిరెడ్డి, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వైఎంప్రసాద్‌రెడ్డి, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ కె.శీనారెడ్డి, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్‌ను సందర్శించిన
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మామడిపాలెంలో ఆధునికీకరించిన రెడ్డి హాస్టల్‌ను వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు విద్యకు ప్రాధాన్యం ఇచ్చి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి