
బియ్యం దందా.. అడ్డుకట్టే లేదు..!
గోడౌన్ కంప్యూటర్ ఆపరేటర్ కీ రోల్...
సాక్షి టాస్క్ ఫోర్స్ :
పేదల కడుపులు నింపాల్సిన రేషన్ బియ్యం కూటమి నేతలకు, రేషన్ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పక్కన పెట్టిన రేషన్ దందాపై దృష్టి సారిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏళ్ల తరబడి పేదలకు రేషన్ అందిస్తున్న డీలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వాటిని తమ వారికి అప్పగించారు. రాజీనామాలు చేయని డీలర్లపై అధికారులను ఉసికొల్పారు. కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. రేషన్ వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకొని పెద్ద ఎత్తుమ అక్రమ వ్యాపారానికి తెరతీశారు. జిల్లాలోని 1392 దుకాణాలన్నీ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నాయి. కొండపి నియోజకవర్గంలో అయితే రేషన్ దందా మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక కీలక నాయకుడి అండదండలతో రేషన్ మాఫియా రెచ్చి పోతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. నెలకు రూ.25 లక్షలు చెల్లించేలా ఒక ఒప్పందం చేసుకొని నియోజకవర్గంలోని మొత్తం రేషన్ వ్యాపారాన్ని సింగరాయకొండకు చెందిన ఒక రైస్ మిల్లు యజమానికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలానికి ఒకరిద్దరిని నియమించుకొని సేకరించిన బియ్యాన్ని నేరుగా సింగరాయకొండలోని ఒక రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
బియ్యం సేకరణ ఇలా...
జరుగుమల్లి మండలంలో రేషన్ బియ్యాన్ని పైడిపాడు, కలమర్ల గ్రామాలకు చెందిన ఇద్దరు తెలుగు తమ్ముళ్లు సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని రేషన్ దుకాణాల డీలర్లు ఎవరైనా సరే వీరికి మాత్రమే బియ్యాన్ని విక్రయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పొన్నలూరు మండలంలో వెంకుపాలెం గ్రామానికి చెందిన ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు బియ్యం సేకరిస్తున్నట్లు సమాచారం. టంగుటూరు మండలంలో సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, కొండపి మండలంలో ఒంగోలు గద్దలగుంటకు చెందిన వ్యక్తితో పాటుగా కొండపి గ్రామానికి చెందిన మరో వ్యక్తి బియ్యం సేకరిస్తున్నట్లు సమాచారం. మర్రిపూడి మండలంలో కూడా ఒంగోలు గద్దలగుంట టీడీపీ నాయకుడు, ఒంగోలుకే చెందిన మరొక వ్యక్తి కలిసి సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక సింగరాయకొండలో నేరుగా అసలు వ్యాపారే బియ్యం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.
ఎక్కడ నుంచి ఎంతెంత...?
నియోజకవర్గంలో నెలకు 13 వేల బస్తాలకు పైగా అక్రమంగా తరలిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొన్నలూరు మండలం నుంచి నెలకు 2 వేల బస్తాలు, జరుగుమల్లి మండలం నుంచి 2,300 బస్తాలు, సింగరాయకొండ మండలం నుంచి 3,300 బస్తాలు, మర్రిపూడి మండలం నుంచి 2 వేల బస్తాలు, కొండపి మండలం నుంచి 2,400 బస్తాల బియ్యం, టంగుటూరు మండలం నుంచి 3 వేల బస్తాల బియ్యాన్ని సేకరించి సింగరాయకొండ రైస్ మిల్లుకు చేరవేస్తున్నట్టు సమాచారం.
కొండపిలో నెలకు 13 వేల బస్తాల రేషన్ బియ్యం తరలింపు
ప్రతి మండలానికి ఒకరిద్దరు చొప్పున బియ్యం సేకరణ
నేరుగా సింగరాయకొండ రైస్ మిల్లుకు తరలింపు
అధికారపార్టీ నాయకులు, అధికారులు నెలవారీ మామూళ్లు
రేషన్ బియ్యంలో అరవై శాతానికి పైగా నేరుగా సివిల్ సప్లయ్ గోడౌన్ నుంచే రైస్ మిల్లుకు తరలిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో గోడౌన్ కంప్యూటర్ ఆపరేటర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సింగరాయకొండ సివిల్ సప్లయ్ గోడౌన్ నుంచి జరుగుమల్లి, పొన్నలూరు, కొండపిలోని 13 దుకాణాలు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల రేషన్ దుకాణాలకు బియ్యం సప్లయ్ చేయాల్సి ఉంది. చీమకుర్తిలోని సివిల్ సప్లయ్ గోడౌన్ నుంచి కొండపిలోని కొన్ని దుకాణాలకు బియ్యం సప్లయ్ జరుగుతుందని సమాచారం. ఉండగా దీనిని అరికట్టాల్సిన అన్ని విభాగాల ప్రభుత్వాధికారులకు నెల మామూళ్లు పెద్ద ఎత్తున అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దందాను వారు చూసీచూడన్నట్టు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.