
తలనొప్పిగా మారిన తలనీలాల సేకరణ
● ఈనెల 24న ఐదోసారి టెండర్
వేములవాడ: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలను సేకరించుకునే హక్కు రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ ఈనెల 11తో ముగిసింది. ఇంతకుముందే ఆలయ అధికారులు నాలుగు దఫాలుగా టెండర్లకు ఆహ్వానించారు. టెండర్ సమయంలోగా పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఆలయ అధికారులకు తలనీలాల సేకరణ తలనొప్పిగా మారింది. టెండర్ నిర్వహణ పూర్తయ్యే వరకు ఆలయ అధికారులకు తలనీలాల సేకరణ ఓ టాస్క్‌గా మారిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఐదోసారి టెండర్‌కు..
భక్తుల తలనీలాలను పోగు చేసుకునే హక్కు కోసం ఈనెల 24న ఉదయం 11 గంటలకు ఈ–టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్ల కోసం తలనీలాలు పోగుచేసి భద్రపరచుకునే లైసెన్స్, హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 94910 00743, 99482 88354, 83339 97623 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే నాలుగుసార్లు టెండర్లు నిర్వహించగా, ఆన్‌లైన్ టెండర్‌లో రూ.13.67 కోట్ల హెచ్చు పాటదారుడిగా ఓ వ్యక్తి ఎంపికయ్యారు. ఈ అంశాన్ని దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించగా, తిరిగి టెండర్ నిర్వహించాలని ఆదేశించడంతో ఐదోసారి టెండర్ నిర్వహించాల్సి వచ్చింది.