ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష
చాలా దూరంలో పలు ఎగ్జామ్ సెంటర్లు
వెళ్లి రాయాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు ● సమయానికి చేరుకోవాలంటే తప్పని తిప్పలు రేపటి నుంచే పరీక్షలు ప్రారంభం ● జిల్లాలో 43 కేంద్రాలు.. 20,595 మంది విద్యార్థులు
సాక్షి, సిద్దిపేట: ఇంటర్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. జిల్లాలో 20,595 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి సంవత్సరం 9,770 మంది ఉండగా జనరల్ 7,161 మంది, ఒకేషనల్ 2,619 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం10,815 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో జనరల్ 8,243, ఒకేషనల్ 2,572 మంది పరీక్ష రాయనున్నారు.
మూడు కిలోమీటర్ల దూరం
గజ్వేల్‌రూరల్: పట్టణంలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని బస్టాండ్ నుంచి సంగాపూర్ రోడ్డులోగల బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాలికల, బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లకు ప్రతినిత్యం మూడు ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం వేళల్లో నడుస్తున్నాయి. అయితే పరీక్షా కేంద్రానికి ఉదయం 8:45గంటలకే చేరుకోవాలనే నిబంధన ఉంది. ఈ మార్గంలో ఎడ్యుకేషన్ హబ్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షా కేంద్రంలో నిత్యం సుమారు 400 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అధ్యాపకులు పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులకు అసలు ‘పరీక్ష’ ఎదురుకానుంది. అసలే ఎండలు.. ఆపై బస్సు సౌకర్యం లేకపోవడం.. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే పెద్ద పరీక్షనే ఎదుర్కోనున్నారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నాయి. ఉదయం 8:45 వరకే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు. 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. వివిధ గ్రామాల నుంచి పలు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలంటే తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష
Comments
Please login to add a commentAdd a comment