గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూపుల గోల
● తారస్థాయికి తూంకుంట,బండారు మధ్య విభేదాలు ● ఇరువర్గాల మధ్య సయోధ్యకుమైనంపల్లి యత్నాలు ● కలసిపని చేయాలని నిర్ణయం
గజ్వేల్: గజ్వేల్ కాంగ్రెస్ గ్రూపులపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. వాటిని చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. గ్రూపుల గోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్న విషయం విదితమే. గతేడాది డిసెంబర్ 3న ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్షిగా రెండు వర్గాల విభేదాలు రచ్చకెక్కిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత కూడా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్ వచ్చిన సందర్భంలో గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా కావడం, బీఆర్‌ఎస్ ఇక్కడ పటిష్టంగా ఉన్న తరుణంలో కాంగ్రెస్‌లో విభేదాలు ఇదే తరహాలో కొనసాగితే... నష్టం తప్పదని గ్రహించి రెండు వర్గాల మధ్య చర్చలు జరపాలని సూచించినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుకు అప్పగించారు. ఈ క్రమంలో మైనంపల్లి రెండు వర్గాలతో సయోధ్య చర్చలు జరిపే పనిలో ఉన్నారు. ఈ మేరకు కొన్ని రోజుల కింద సిద్దిపేటలో ఇరు వర్గాల మధ్య జరిపారు. తాజాగా శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని తన నివాసం పక్కన ఉన్న ఓ ఆలయంలో మరోసారి చర్చలు జరిపారు. కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు గజ్వేల్‌కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. మైనంపల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చలు ఫలిస్తే రెండు వర్గాలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment