పంటలను కాపాడండి
● దేవాదుల మూడవ ఫేజ్ మోటార్లుఆన్ చేయండి ● సర్కార్ నిర్లక్ష్యంతోనేఎండిపోతున్న పంటలు ● అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల(సిద్దిపేట): దేవాదుల ప్రాజెక్టు నుంచి మూడవ ఫేజ్ మోటార్లు ఆన్‌చేసి సాగునీరు అందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో దేవాదుల నీటి విడుదలపై మాట్లాడారు. జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల ప్రాంతం దేవాదుల ఆయకట్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం వరి, ఇతర పంటలు నీరులేక ఎండిపోతున్నాయని తెలిపారు. కాబట్టి దేవాదుల మూడవ ఫేజ్ కింద సాగునీరు అందించాలని కోరారు. దేవాదుల మొదటి, రెండవ ఫేజ్ పూర్తి కాగా, మూడవ ఫేజ్ నిర్మాణ పనులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వస్తున్న క్రమంలో అత్యవసరంగా నీటిని విడుదల చేసి, ఎండుతున్న పంటలను కాపాడాలని కోరారు. జనగామ నియోజకవర్గ పరిధిలో సుమారు 1.50లక్షల ఎకరాలు దేవాదుల ఆయకట్టు కిందికి వస్తుందని చెప్పారు. జిల్లాలో 5.14లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కేవలం 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి, 34 రోజులుగా పంపు మోటార్లు ఆగిపోయేటట్టు చేశారని ఆరోపించారు. దీంతో రూ.600 కోట్ల మేర రైతులు నష్టపోయేలా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయకట్టు, కాల్వ పరిధి కాకున్నా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తపాస్‌పల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి నీళ్లు కావాలని జులుం చేయడం ఏమిటని పల్లా ప్రశ్నించారు. ఆయకట్టు ప్రతిపాదనలతో సంబంధం లేకుండా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గండిరామారం నుంచి నీటిని తరలించడం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. దేవాదుల పంప్‌హౌజ్ వద్ద పంపు ఆపరేటర్లు నిరసన తెలిపే సమయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే ప్రస్తుతం కొద్ది పాటి నీటి విడుదలకు కారణమైందన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment