కోహెడరూరల్(హుస్నాబాద్): తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. మండలంలోని సముద్రాల గ్రామంలో కొన్ని రోజులుగా తాగునీరు రావడం లేదంటూ పలువురు మహిళలు బుధవారం సిద్దిపేట–హుస్నాబాద్ రోడ్డుపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. సుమారు గంటకుపైగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చాలా రోజులుగా నీటి సమస్య ఉందని ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగామని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడి ధర్నా ను విరమింపజేశారు.
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఈ నెలాఖరులోగా తమ లైఫ్ సర్టిఫికెట్లను సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాలలో సమర్పించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించని వారికి ఏప్రిల్ నెల పెన్షన్ నిలిపి వేస్తారన్నారు. మీసేవ కేంద్రం ద్వారా లేక పోస్టల్ డిజిటల్ పేమెంట్ పద్ధతి ద్వారా.. లేదంటే ప్రత్యక్షంగా లైఫ్ సర్టిఫికెట్లు అందించే అవకాశం ఉందన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలోని గిరిజన యువతీయువకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అఖిలేష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వ్యాధి నిరోధక టీకాలివ్వండి
రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ చైల్డ్ హెల్త్
అండ్ ఇమ్యునైజేషన్ అధికారి సుధీర
సిద్దిపేటకమాన్: చిన్నపిల్లలకు, గర్భిణులకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు వంద శాతం అమలు చేయాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధీర అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగం, ఎస్‌ఎన్‌సీయూ వార్డును, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను, జిల్లాలోని పలు పీహెచ్‌సీలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్‌తో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. చిన్న పిల్లలకు అందుతున్న ఆరోగ్య, వైద్య సేవలపై ఆరా తీసి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సంధర్బంగా సుధీర మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల పట్ల తల్లిపాల ప్రాముఖ్యత గురించి బాలింతలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ శాంతి, ఆర్‌ఎంఓలు పద్మజ, శ్రావణి, రాష్ట్ర బృందం, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నీటిని వృథా చేయొద్దు
గజ్వేల్‌రూరల్: ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య సూచించారు. ఈ సందర్భంగా బుధవారం మిషన్ భగీరథ అధికారులను కలిసి నీటి సమస్యను వివరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని బా లుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లో పర్యటించి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో ధర్నా