బ్లిట్జ్ గేమ్‌లో వరల్డ్ నంబర్‌వన్‌ను 20 ఎత్తుల్లో ఓడించిన భారత నంబర్‌వన్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై అర్జున్ విజయం సాధించాడు. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ ఎత్తులకు చిత్తయిన కార్ల్‌సన్ 20 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. ఓపెన్ విభాగంలో 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు బ్లిట్జ్ టోర్నీ జరుగుతోంది.
తొలి రోజు శనివారం 9 రౌండ్ గేమ్‌లు జరిగాయి. తొమ్మిది రౌండ్ గేమ్‌లు ముగిశాక కార్ల్‌సన్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 6 పాయింట్లతో రెండో స్థానంలో, అర్జున్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తొలి రోజు అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి (నొదిర్‌బెక్, నిహాల్ సరీన్, విదిత్, కార్ల్‌సన్‌లపై), మూడు గేమ్‌లను (విన్సెంట్, డానిల్ దుబోవ్, నారాయణన్‌లతో) ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో (సో వెస్లీ, ప్రజ్ఞానంద చేతుల్లో) ఓడిపోయాడు.
ఇదే టోర్నీలోని మహిళల బ్లిట్జ్ విభాగంలో తొలి రోజు 9 రౌండ్ గేమ్‌లు ముగిశాక భారత ప్లేయర్లు దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, కోనేరు హంపి 4.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4 పాయింట్లతో ఏడో స్థానంలో, వైశాలి 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment