Magnus Carlson
-
కార్ల్‌సన్‌కు అర్జున్ షాక్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై అర్జున్ విజయం సాధించాడు. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ ఎత్తులకు చిత్తయిన కార్ల్సన్ 20 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. ఓపెన్ విభాగంలో 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు బ్లిట్జ్ టోర్నీ జరుగుతోంది. తొలి రోజు శనివారం 9 రౌండ్ గేమ్‌లు జరిగాయి. తొమ్మిది రౌండ్ గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 6 పాయింట్లతో రెండో స్థానంలో, అర్జున్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తొలి రోజు అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి (నొదిర్బెక్, నిహాల్ సరీన్, విదిత్, కార్ల్సన్లపై), మూడు గేమ్‌లను (విన్సెంట్, డానిల్ దుబోవ్, నారాయణన్‌లతో) ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో (సో వెస్లీ, ప్రజ్ఞానంద చేతుల్లో) ఓడిపోయాడు. ఇదే టోర్నీలోని మహిళల బ్లిట్జ్ విభాగంలో తొలి రోజు 9 రౌండ్ గేమ్‌లు ముగిశాక భారత ప్లేయర్లు దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, కోనేరు హంపి 4.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4 పాయింట్లతో ఏడో స్థానంలో, వైశాలి 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌పై విదిత్ విజయం
చెన్నై: ప్రొ చెస్ లీగ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరా తి గొప్ప ఫలితం సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై విదిత్ గెలుపొందాడు. ఆన్లైన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియన్ యోగిస్ జట్టు తరఫున పోటీపడుతున్న విదిత్ బ్లిట్జ్ గేమ్‌లో 58 ఎత్తుల్లో కెనడా చెస్బ్రాస్ జట్టు తరఫున ఆడుతున్న కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీని లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కార్ల్‌సన్‌ను ఓడించిన నాలుగో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ కావడం విశేషం. ప్రజ్ఞానంద, గుకేశ్, ఇరిగేశి అర్జున్ కూడా ఈ నార్వే దిగ్గజంపై వివిధ టోరీ్నలలో గెలుపొందారు. -
చెస్‌కు చెక్!
మాస్కో: కరోనా విలయతాండవంలోనూ దానికి సంబంధం లేనట్లుగా జరుగుతున్న ఒకే ఒక్క పెద్ద క్రీడా ఈవెంట్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ. ఇందులో విజేతగా నిలిచిన ఆటగాడు ప్రపంచ చెస్ టోర్నమెంట్లో నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడతాడు. అయితే ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది. రష్యాలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో ఉన్నపళంగా టోర్నీని నిలిపివేయక తప్పలేదు. శుక్రవారం (ఈ నెల 27) నుంచి విమాన రాకపోకల్ని నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టోర్నీని కొనసాగిస్తే... ఈవెంట్ ముగిశాక వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు స్వదేశం చేరే అవకాశాలు మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఈవెంట్‌ను నిలిపివేసింది. ‘ఫిడే ఈ టోర్నమెంట్‌ను ఇలాగే కొనసాగిస్తే ఆటగాళ్లు, అధికారులు, ఇతరత్ర సిబ్బందిని నిర్ణీత గడువులోగా వారి స్వదేశాలకు పంపలేదు. ఈ నేపథ్యంలో ‘ఫిడే’ నిబంధనల మేరకు ఈవెంట్‌ను నిలిపివేయాలని నిర్ణయించాం’ అని ఫిడే అధ్యక్షుడు అర్కడి వొర్కవిచ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 7 రౌండ్లు జరిగాయి. మాక్సిమ్ వాచియెల్ (ఫ్రాన్స్), ఇయాన్ నెపొమ్నియాచి (రష్యా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. తిరిగి మొదలైతే 8వ రౌండ్ నుంచి కొనసాగిస్తారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ‘కోవిడ్–19’ వల్లే జర్మనీలో ఇరుక్కుపోయాడు. విదేశీ ప్రయాణ ఆంక్షలతో అక్కడే ఆగిపోయాడు. దీంతో అతను క్యాండిడేట్స్ చెస్‌కు ఆన్లైన్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. -
చాంపియన్ కార్ల్సన్
కోల్‌కతా: టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో ఓవరాల్ చాంపియన్‌గా విశ్వవిజేత మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) నిలిచాడు. మొత్తం 27 పాయింట్లతో అతను అగ్రస్థానాన్ని అలంకరించాడు. కార్ల్‌సన్‌కు 37,500 డాలర్లు (రూ. 26 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 23 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 18.5 పాయింట్లతో సో వెస్లీ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... సో వెస్లీకి మూడో స్థానం, అనీశ్‌కు నాలుగో స్థానం లభించాయి. భారత గ్రాండ్‌మాస్టర్లు విశ్వనాథన్ ఆనంద్ (16 పాయింట్లు) ఏడో స్థానంలో, పెంటేల హరికృష్ణ (14.5 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో, విదిత్ సంతోష్ గుజరాతి (14.5 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచారు. గ్రాండ్ చెస్ టూర్లో భాగమైన ఈ టోర్నీలో పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తొలుత ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత బ్లిట్జ్ విభాగంలో పాల్గొన్నారు. నిర్ణిత ఏడు గ్రాండ్ చెస్ టూర్ టోరీ్నలు ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన కార్ల్సన్, లిరెన్ డింగ్ (చైనా), అరోనియన్ (అర్మేనియా), మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) డిసెంబర్ 2 నుంచి 8 వరకు లండన్‌లో జరిగే గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. -
ఆనంద్‌కు ఏడో స్థానం
స్టావాంజర్ (నార్వే): పది మంది సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ మధ్య జరిగిన నార్వే ఓపెన్ బ్లిట్జ్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఏడో స్థానంలో నిలిచాడు. తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లు సాధించాడు. ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్, రెండింటిలో ఓడి, మరో గేమ్‌లో గెలిచాడు. మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో మంగళవారం జరిగిన క్లాసికల్ విభాగం తొలి గేమ్‌లో మాక్సిమ్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆదిబన్ 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిపి మొత్తం 14 మంది గ్రాండ్‌మాస్టర్లు 13 రౌండ్లపాటు పోటీపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలువగా... సో వెస్లీ (అమెరికా–9 పాయింట్లు) స్వర్ణం, కార్ల్సన్ (8 పాయింట్లు) రజతం సాధించారు. -
హరికృష్ణకు ఏడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లు సంపాదించాడు. ప్రపంచ ఏడో ర్యాంకర్ అరోనియన్ (అర్మేనియా)తో చివరిదైన తొమ్మిదో రౌండ్లో తలపడిన హరికృష్ణ 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ ఆరు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. -
కార్ల్సన్ చేతికి ట్రోఫీ
సోచి: ప్రపంచ చెస్ విజేతగా నిలిచిన మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) సగర్వంగా తన టైటిల్‌ను అందుకున్నాడు. మంగళవారం సోచిలో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఫిడే’ అధ్యక్షుడు ఇల్యుమ్‌జినోవ్ ట్రోఫీని మాగ్నస్‌కు అందజేశారు. ట్రోఫీతో పాటు సాంప్రదాయ తరహాలో పచ్చని ఆకులతో తయారు చేసిన హారం కూడా కార్ల్సన్ మెడలో పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. 2016లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను అమెరికాలో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ‘ఫిడే’ ప్రకటించింది. -
'నా జూదం ఫలించలేదు'
సోచి: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్నకలలు కల్లలు కావడంతో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఆటపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'చాలా ఉద్వేగభరిత క్షణాలు అవి. 27వ ఎత్తును బీజీ7 వేస్తే పరిస్థితి సమంగా ఉండేది. అయితే నా జూదం ఫలించలేదు. అందుకు తగిన శిక్ష పడింది. ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమది. మొత్తంగా చూస్తే నల్ల పావులతో నేను బాగానే ఆడాను. అయితే మాగ్నస్ కార్ల్ సన్ మెరుగ్గా ఆడాడని అంగీకరించాలి' ఆనంద్ తెలిపాడు. అతను ఒత్తిడిని తనకంటే బాగా ఎదుర్కొన్నాడని,. అతనితో పోలిస్తే ఎక్కువ సార్లు తానే బలహీనంగా కనిపించానన్నాడు. ఈ ఓటమితో తాను చెస్ మానేయాలని అనుకోవడం లేదని ఆనంద్ తెలిపాడు. -
‘కింగ్' కార్ల్సన్
సాక్షి క్రీడావిభాగం: ఎలా మొదలు పెట్టామన్నది కాదు... ఎలా ముగించామన్నదే ముఖ్యం. ఈ డైలాగ్ చెస్ మేధావి మాగ్నస్ కార్ల్‌సన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. చదరంగంలో దిగ్గజాలు, మహామహులు కూడా గేమ్‌లో ఓపెనింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. మంచి ఆరంభం లభిస్తే సగం గేమ్ సొంతమైనట్లు అనుకుంటూ కొత్త తరహా ఓపెనింగ్లను ప్రయత్నిస్తారు. కానీ మాగ్నస్ దానిని లెక్క చేయడు. ఎలాంటి శైలి లేకపోవడం కూడా ఒక శైలి అన్నట్లుగా... పాపులర్ ఓపెనింగ్లను పట్టించుకోకుండా ప్రతీ గేమ్‌ను కొత్త రకం ఎత్తులతో ప్రారంభించడమే మాగ్నస్ పద్ధతి. శాస్త్రీయత లేని సన్నాహకంగా కొందరు విమర్శించినా... ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాకుండా మరింత గందరగోళంలో పడేసే ఈ నార్వేయన్ స్టైల్ ఇప్పుడు అతడిని శిఖరాన నిలబెట్టింది. కార్ల్సన్ బలం, బలగం అంతా మిడిల్ గేమ్‌లోనే. కంప్యూటర్ విశ్లేషకులు, గ్రాండ్ మాస్టర్లు ఇక ఆట ముగిసింది... ‘డ్రా’ తప్ప మరో అవకాశం లేదని తేల్చేసిన చోటే కార్ల్సన్ దూకుడు మొదలవుతుంది. అక్కడి నుంచి అతను వేసే వైవిధ్యమైన ఎత్తులు గేమ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. చివరకు అతడిని విజేతగా నిలుపుతాయి. దీనికి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు కార్ల్సన్ ఎఫెక్ట్. ఆరంభపు అడుగులు... 24వ పుట్టిన రోజుకు వారం రోజుల ముందే ఈ చదరంగ పిడుగు మరోసారి జగజ్జేతగా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కార్ల్సన్ నేపథ్యం, అతనిలో వయసుకు మించిన ప్రతిభను చూసినవారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. మాటలు కూడా సరిగా రాని రెండేళ్ల వయసులోనే అతను కఠినమైన జిగ్ సా పజిల్స్ ఛేదించాడు. 14 ఏళ్ల వయసువారు ఎంచుకునే లెగో బ్రిక్స్‌ను నాలుగేళ్లకే ఆడుకున్నాడు. ప్రపంచ దేశాల పేర్లు, జనాభా... ఇలా సమస్త విజ్ఞాన సర్వస్వం బుర్రకెక్కించుకున్న మాగ్నస్ చాలా మందిలాగా బాల మేధావిగా మిగిలిపోలేదు. ఆరంభంలో ఆసక్తి లేకపోయినా, తండ్రి ప్రోత్సాహంతో, శిక్షణతో 64 గడుల ఆటలో తనదైన ముద్ర వేశాడు. అన్నీ ఘనతలే... ఒక్కసారి చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న తర్వాత కార్ల్సన్ ఇక ఆగలేదు. నార్వేలోని అన్ని వయో విభాగాల ఈవెంట్లలో పోటీ పడుతూ వరుసగా విజయాలు దక్కించుకున్నాడు. 2004లో అతని పేరు ప్రపంచ చెస్‌కు పరిచయమైంది. 13 ఏళ్ల 148 రోజుల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయి ఆ సమయంలో ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆ తర్వాత కూడా నిలకడగా విజయాలు సాధిస్తూ 19 ఏళ్లకే ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010 జనవరి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఆరు నెలలు మినహాయిస్తే (ఆనంద్) ఇప్పటికీ అతనే నంబర్‌వన్ కావడం విశేషం. కొన్నాళ్లు చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ శిక్షణలో రాటుదేలిన మాగ్నస్, ఆ తర్వాత దూసుకుపోయాడు. ఏకంగా ప్రపంచ చెస్‌లో అత్యుత్తమ ఎలో రేటింగ్ (2882)తో పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. కంప్యూటర్లో ఆటను నేర్చుకునేకంటే తన మెదడుకే పదును పెట్టడం ఇష్టపడతానని చెప్పే మాగ్నస్, ఇప్పుడు ఏకకాలంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌లలో ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతున్నాడు. ఆటొక్కటే కాదు... వరల్డ్ చాంపియన్ చాలెంజర్‌ను ఎంపిక చేసే క్రమంలో ఫిడే ఇష్టారాజ్యంగా నిబంధనలు మారుస్తుందంటూ ధ్వజమెత్తి ఒకసారి టోర్నీ నుంచే తప్పుకోవడం ఈ నార్వే ఆటగాడిలో మరో కోణం. సాధారణంగా చెస్ ఆటగాళ్లలో కనిపించే గాంభీర్య ప్రదర్శన కాకుండా అతనికి టెన్నిస్, బాస్కెట్‌బాల్, టీటీ, వాలీబాల్... ఇలా అన్ని క్రీడల్లో ప్రవేశం ఉండటం విశేషం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ విరామం సమయంలో అతను వీటితోనే పునరుత్తేజం పొందాడు. ఒక డ్రెస్ డిజైనింగ్ కంపెనీకి మోడల్‌గా కూడా పని చేసిన ఇతను, హాలీవుడ్ చిత్రం స్టార్ ట్రెక్ ఇంటూ డార్క్‌నెస్‌లో అవకాశం వచ్చినా చేయలేకపోయాడు. గతంలో కేవలం అటాకర్గానే గుర్తింపు ఉన్న కార్ల్సన్ ఇప్పుడు యూనివర్సల్ ప్లేయర్‌గా మారి మరోసారి చదరంగపు రారాజుగా నిలిచాడు. -
ఆనందం ఆవిరి
ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కలలు కల్లలయ్యాయి. ఏడాదిలోపు అదే ప్రత్యర్థి చేతిలో ఆనంద్‌కు మరో షాక్... పాయింట్లలో తేడా మినహా అదే ఫలితం పునరావృతం... మ్యాచ్‌ను ఆఖరి గేమ్ వరకు నడిపించాలంటే ఓడకుండా ఉండాల్సిన మ్యాచ్‌లో ఆనంద్ తప్పటడుగు వేశాడు. సాహసం చేయబోయి తాను వేసిన ఎత్తులో తానే చిక్కుకున్నాడు. ఫలితమే... మాగ్నస్ కార్ల్సన్ మోముపై మరోసారి చిరునవ్వు మెరిసింది. వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి చదరంగపు వేదికపై ‘కింగ్’ అనిపించుకున్నాడు. సోచి: విశ్వనాథన్ ఆనంద్-మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోరు ఒక గేమ్ ముందుగానే ముగిసింది. ఆదివారం జరిగిన 11వ గేమ్‌లో కార్ల్సన్ 45 ఎత్తులో ఆనంద్‌ను చిత్తు చేశాడు. ఫలితంగా 6.5-4.5 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే 27వ ఎత్తులో వేసిన ఎత్తు అతడిని విజయానికి దూరం చేసింది. ఈ పొరపాటును ఉపయోగించున్న మాగ్నస్, మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను విజయం వైపు తీసుకుపోయాడు. ఈ గేమ్ గెలిస్తే అవకాశాలు నిలిచి ఉంటాయని భావించిన ఆనంద్, అనవసరపు దూకుడు ప్రదర్శించాడు. ‘డ్రా’కు కూడా మంచి అవకాశం ఉన్న దశలో ధైర్యం చేసి భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అయితే అది పని చేయకపోగా, ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ 3 గేమ్‌లు, ఆనంద్ 1 గేమ్ గెలవగా, మిగతా 7 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఫలితం తేలిపోవడంతో మంగళవారం జరగాల్సిన 12వ గేమ్ ఇక నిర్వహించరు. -
మళ్లీ ‘డ్రా'నే..
ఆనంద్‌ను నిలువరించిన కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): ఆనంద్‌లాంటి అనుభవజ్ఞులను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భావించిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ఎనిమిదో గేమ్‌కు పక్కాగా సిద్ధమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ గేమ్‌ను నార్వే గ్రాండ్‌మాస్టర్ 41 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగించాడు. తెల్లపావులతో క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో ఈ గేమ్‌ను ప్రారంభించిన ఆనంద్‌కు ఏ దశలోనూ గెలిచే అవకాశం రాలేదు. 21 ఎత్తులు ముగిశాక ఈ గేమ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితం రాదని తేలిపోయింది. ఏడో గేమ్‌లో 80 ఎత్తుల తర్వాత ‘డ్రా' ఖాయమని తేలినా కార్ల్సన్ మొండిగా ఆడుతూ 122 ఎత్తుల వరకు కొనసాగించాడు. ఆనంద్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే కార్ల్సన్ ఈ వ్యూహాన్ని అమలు చేశాడు. ఎనిమిదో గేమ్‌లో ఆనంద్‌కూ ఇలాంటి అవకాశం ఉన్నా ఫలితం రాదనే ఉద్దేశంతో ‘డ్రా'కే మొగ్గు చూపాడు. ప్రస్తుతం కార్ల్సన్ 4.5-3.5తో ఆధిక్యంలో ఉన్నాడు. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే తొమ్మిదో రౌండ్లో కార్ల్సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు. ఈ గేమ్ కోసం కార్ల్సన్ బృందం బాగా సన్నద్ధమై వచ్చింది. 9వ ఎత్తులో కార్ల్సన్ రూక్ ఈ8 ఆడాడు. ఇది చాలా కొత్త మూవ్. దీనిని ఆనంద్ ఊహించలేదు. అక్కడి నుంచి తను బాగా ఆలోచనలో పడ్డాడు. దీనికి తోడు ఆనంద్ ఆడిన ప్రతి మూవ్కీ కార్ల్సన్ ముందుగానే సన్నద్ధమై వచ్చాడు. ఆనంద్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ‘డ్రా’ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. ఇక ఆనంద్ మిగిలిన నాలుగు గేమ్స్‌లో రెండు బ్లాక్స్‌తో ఆడాలి. ఈ రెండు గేమ్స్‌లోనూ కార్ల్సన్ కచ్చితంగా వైట్స్‌తో విజయం కోసం ప్రయత్నిస్తాడు. మిగిలిన రెండు వైట్స్‌తో ఆడే గేమ్స్‌లో ఆనంద్ పుంజుకోకపోతే కష్టం. - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్ గేమ్ సాగిందిలా... 1. d4Nf6 2. c4e6 3. Nf3d5 4. Nc3Be7 5. Bf4O-O 6. e3c5 7. dxc5Bxc5 8. a3Nc6 9. Qc2Re8 10. Bg5Be7 11. Rd1Qa5 12. Bd3h6 13. Bh4dx-c4 14. Bxc4a6 15. O-Ob5 16. Ba2Bb7 17. Bb1Rad8 18. Bxf6Bxf6 19. Ne4Be7 20. Nc5Bxc5 21. Qxc5b4 22. Rc1bxa3 23. bxa3Qx-c5 24. Rxc5Ne7 25. Rfc1Rc8 26. Bd3Red8 27. Rxc8Rxc8 28. Rxc8+Nxc8 29. Nd2Nb6 30. Nb3Nd7 31. Na5Bc8 32. Kf1Kf8 33. Ke1Ke7 34. Kd2Kd6 35. Kc3Ne5 36. Be2Kc5 37. f4Nc6 38. Nxc6Kxc6 39. Kd4f6 40. e4Kd6 41. e5+ 1/2,1/2. -
చేజేతులా ఓడిన ఆనంద్
సోచి (రష్యా): నల్ల పావులతో ఆడుతున్నపుడు విజయావకాశాలు తక్కువగా వస్తాయి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తగిన ఫలితం వస్తుంది. సువర్ణావకాశం చేజారిందని తెలిస్తే... ఆ ప్రభావం ఆటపై పడి మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఆరో గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఎదురైంది. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో ఆనంద్ చేజేతులా ఓడిపోయాడు. తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ 37 ఎత్తుల్లో ఆనంద్‌పై గెలిచాడు. ఆరు గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 3.5-2.5తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం ఏడో గేమ్ జరుగుతుంది. ఇందులోనూ ఆనంద్ నల్లపావులతోనే ఆడతాడు. ఆనంద్‌తో జరిగిన ఆరో గేమ్‌లోని 26వ ఎత్తులో కార్ల్సన్ ఘోరమైన తప్పిదం చేశాడు. తన రాజును డి2 గడిలోకి పంపాడు. కార్ల్సన్ చేసిన పొరపాటును ఆనంద్ గ్రహించి తదుపరి ఎత్తులో తన గుర్రంతో ఈ5లోని కార్ల్సన్ బంటును చంపిఉంటే ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తప్పకుండా గెలిచేవాడు. కానీ ఆనంద్ ఈ సువర్ణావకాశాన్ని పసిగట్టకుండా కేవలం నిమిషంలోపే తన బంటును ఏ4లోకి పంపించి గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. ఆనంద్ చేసిన పొరపాటుతో కార్ల్సన్ ఊపిరి పీల్చుకొని మళ్లీ పుంజుకోవడమే కాకుండా గేమ్‌లోనూ విజయం సాధించాడు. ‘ప్రత్యర్థి నుంచి బహుమతి వస్తుందని ఆలోచనే లేనపుడు అది మనకు కనిపించదు’ అని తాను చేసిన తప్పిదంపై గేమ్ ముగిసిన తర్వాత ఆనంద్ వ్యాఖ్యానించాడు. వేగమే ఆనంద్‌ను ముంచింది గేమ్ ఆరంభంలో ఆనంద్ చాలా వేగంగా ఆడాడు. కార్ల్సన్ ఎత్తులకు బాగా సన్నద్ధమై వచ్చాడని అనిపించింది. అయినా గేమ్ మొదటి నుంచి కూడా వైట్స్‌తో ఆడిన కార్ల్సన్ ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. 26వ మూవ్ దగ్గర కార్ల్సన్ చాలా పెద్ద తప్పు చేశాడు. కానీ ఆనంద్ దానిని చూసుకోకుండా వేగంగా ఆడాడు. అక్కడ నైట్‌ను ఈ5లోకి పంపితే ఆనంద్ గేమ్ గెలిచేవాడు. ఆనంద్ స్థాయి ఆటగాడు కనీసం మూడు, నాలుగు నిమిషాలు ఆలోచించి ఉంటే సులభంగా దానిని కనిపెట్టేవాడు. కానీ ఎందుకో వేగంగా మూవ్ ఆడి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కార్ల్సన్ వెంటనే తప్పు తెలుసుకుని మళ్లీ పుంజుకున్నాడు. గెలిచే అవకాశాన్ని వదులుకున్న విషయం ఆనంద్‌కు తర్వాత తెలిసింది. బహుశా ఇది ప్రభావం చూపిందేమో... అక్కడి నుంచి క్రమంగా పట్టు కోల్పోయి గేమ్ ఓడాడు. - హరికృష్ణ -
దెబ్బకు దెబ్బ
సోచి (రష్యా): శక్తివంతమైన ప్రారంభం... స్పష్టమైన అం చనా... మంచి సాంకేతికత... శ్రేష్టమైన సమయపాలన.. వెర సి ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి విజయం. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో మంగళవారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మూడో గేమ్‌లో ఆనంద్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. తెల్లపావులతో ఆడుతూ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. నాలుగేళ్ల తర్వాత ఆనంద్ క్లాసిక్ విభాగంలో కార్ల్‌సన్‌పై తొలిసారి గెలిచాడు. 2010 లండన్ క్లాసిక్ టోర్నీలో భాగంగా కార్ల్‌సన్‌పై చివరిసారి 77 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్ ఆ తర్వాత ఈ నార్వే ప్లేయర్‌పై ఈ విభాగంలో నెగ్గలేకపోయాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్, కార్ల్సన్ 1.5-1.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నాలుగో గేమ్ బుధవారం జరుగుతుంది. తొలి రెండు గేముల్లో మంచి ఓపెనింగ్ చేసినా స్వయం తప్పిదాలతో తడబడిన ఆనంద్ ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం చేయలేదు. ఒకదశలో ఆనంద్ వేసిన ఎత్తులను కార్ల్సన్ అర్థం చేసుకోలేకపోయాడు. -
ఆనంద్‌కు చుక్కెదురు
-
ఆనంద్‌కు చుక్కెదురు
రెండో గేమ్‌లో కార్ల్సన్ గెలుపు {పపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): కీలకదశలో అనవసర తప్పిదం చేసిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో తొలి ఓటమిని చవిచూశాడు. ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ 35 ఎత్తుల్లో ఆనంద్‌ను ఓడించాడు. ఆరంభంలో ఆనంద్ ఆటతీరును చూస్తే రెండో గేమ్ కూడా ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. కానీ కార్ల్సన్ సంయమనంతో ఆడి మిడిల్ గేమ్‌లో ఆనంద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత ఆనంద్ తడబడి 34వ ఎత్తులో బంటును హెచ్5 గడిలోకి పంపి కోలుకోలేని తప్పిదం చేశాడు. ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న కార్ల్సన్ తర్వాతి ఎత్తులోనే ఆనంద్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో కార్ల్సన్ 1.5-0.5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం మూడో గేమ్ జరుగుతుంది. -
‘డ్రా'తో మొదలైంది...
-
‘డ్రా'తో మొదలైంది...
సోచి (రష్యా): కొత్త ప్రయోగాలు చేయకుండా... సాహసోపేత ఎత్తులు వేయకుండా... ఆద్యంతం ఆచితూచి ఆడటంతో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ల మధ్య తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 48 ఎత్తుల ఆనంతరం గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేదని భావించిన ఆనంద్, కార్ల్సన్ ‘డ్రా’కు అంగీకరించారు. గత ఏడాది ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కార్ల్‌సన్‌పై ఒక్క గేమ్ కూడా గెలువలేకపోయిన ఆనంద్ ఈసారి తన వ్యూహాలకు మరింత పదును పెట్టుకొని బరిలోకి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెల్లపావులతో ఆరంభంలో ఆనంద్ వేసిన కొన్ని ఎత్తులకు సమాధానం ఇవ్వడానికి కార్ల్సన్ చాలా సమయమే తీసుకున్నాడు. గేమ్ మొదట్లో ఆనంద్‌దే పైచేయి కనిపించినా... పట్టుదలకు మారుపేరైన కార్ల్సన్ నెమ్మదిగా గేమ్‌లోకి వచ్చాడు. 24 ఎత్తులు ముగిసేసరికి కార్ల్‌సన్‌కే కాస్త అనుకూలత ఉన్నప్పటికీ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో గేమ్ ‘డ్రా’ దిశగా సాగింది. తన ప్రత్యర్థి పొరపాట్లు చేయాలని, దాని ద్వారా తాను లాభం పొందాలని కార్ల్సన్ శతవిధాలా ప్రయత్నించాడు. చివర్లో ఆనంద్‌కు ఇబ్బందికర పరిస్థితి తప్పదేమో అనిపించింది. అయితే కార్ల్సన్ 42వ ఎత్తులో తన ఏనుగును ఈ3 గడిలో బదులు ఈ2 గడిలోకి పంపించడంతో ఆనంద్‌కు ఊరట లభించింది. గేమ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో కార్ల్సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు. -
పైచేయి ఎవరిదో!
సోచి (రష్యా): సొంతగడ్డపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విశ్వనాథన్ ఆనంద్... మళ్లీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రపంచ చదరంగంపై పట్టు సాధించాలని మాగ్నస్ కార్ల్సన్.... ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య శనివారం ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు తొలి గేమ్‌తో తెరలేవనుంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గే అవకాశం ఇవ్వకుండా కార్ల్సన్ నెగ్గినతీరు అందర్నీ అబ్బురపరిచింది. అదే సమయంలో ఆనంద్ ఓడిన విధానం ఆందోళన కలిగించింది. ఏడాది తిరిగేలోపు మళ్లీ వీరిద్దరూ ప్రపంచ టైటిల్ కోసం సిద్ధమయ్యారు. ఈసారీ కార్ల్‌సన్‌ను ఫేవరెట్‌గా పరిగణిస్తున్నప్పటికీ... ఆనంద్‌ను మాత్రం తక్కువ అంచనా వేయడంలేదు. గత ఏడాది మాదిరిగా ఏకపక్షంగా కాకుండా... ఈసారి పోరు నువ్వా నేనా అన్నట్లు సాగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. {పపంచ చాంపియన్ అయ్యాక... క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి మళ్లీ ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందిన రెండో క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. గతంలో అనతోలి కార్పోవ్ (రష్యా-1987, 1990లో) రెండుసార్లు ఈ విధంగా అర్హత సాధించాడు. విక్టర్ కార్చునోయ్ తర్వాత పెద్ద వయస్సులో క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన రెండో ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. కార్చునోయ్ 46 ఏళ్లకు (1977లో), ఆనంద్ 44 ఏళ్లకు ఈ టోర్నీని గెలిచారు. ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి చెస్ ప్లేయర్‌గా మాగ్నస్ కార్ల్సన్ గుర్తింపు పొందాడు. 24 ఏళ్ల తర్వాత అదే ప్రత్యర్థుల మధ్య వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. గతంలో కాస్పరోవ్ (రష్యా), అనతోలి కార్పోవ్ (రష్యా) ఈ విధంగా ఐదుసార్లు (1984, 1985, 1986, 1987, 1990) తలపడ్డారు. ముఖాముఖి అన్ని టైమ్ ఫార్మాట్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) లలో కలిపి ఆనంద్, కార్ల్సన్ ముఖాముఖిగా 79 సార్లు తలపడ్డారు. క్లాసికల్ ఫార్మాట్లో 38 సార్లు పోటీపడగా.. ఆనంద్ ఆరుసార్లు, కార్ల్సన్ ఏడుసార్లు గెలిచారు. మిగతా గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి. వేదిక 2014 వింటర్ ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన రష్యాలోని సోచి పట్టణంలోని ఒలింపిక్ మీడియా సెంటర్. సమయం భారత కాలమానం ప్రకారం అన్ని రౌండ్ల గేమ్‌లు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. గేమ్ జరిగేదిలా... తొలి 40 ఎత్తులకు 120 నిమిషాలు. ఆ తర్వాత 20 ఎత్తులకు 60 నిమిషాలు. ఆ తర్వాత మరో 15 నిమిషాలు. 61వ ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు అదనంగా 30 సెకన్లు కలుస్తాయి. {పతి గేమ్ ప్రారంభ సమయానికి కనీసం 10 నిమిషాల ముందే ఇద్దరు ఆటగాళ్లు భద్రత తనిఖీల కోసం వేదిక వద్దకు చేరుకోవాలి. ఇద్దరు ఆటగాళ్లు 30వ ఎత్తులోపు ‘డ్రా’ కోసం ప్రతిపాదన చేయకూడదు. తప్పనిసరి అయితే చీఫ్ ఆర్బిటర్ అంగీకారంతోనే ఇలా జరగాలి. గేమ్ సందర్భంగా ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చీఫ్ ఆర్బిటర్ కనిష్టంగా ఐదు వేల యూరోలు జరిమానా విధిస్తారు. -
అనంద్ దెబ్బతిన్న పులి
ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో కార్ల్సన్... ఆనంద్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు. మళ్లీ ఈ పోరుకు అర్హత సాధించిన ఆనంద్... కార్ల్‌సన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్ ఈసారి రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం, శనివారం నుంచి గేమ్స్ జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్ గురించి తెలుగుతేజం, చెస్ స్టార్ పెంటేల హరికృష్ణ అందిస్తున్న ప్రివ్యూ... పెంటేల హరికృష్ణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం శనివారం ఆవిషృ్కతం కానుంది. 2013లో చెన్నైలో తలపడిన విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మరోసారి ఇక్కడ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రష్యాలోని సోచి నగరం ఇందుకు వేదిక కానుంది. ఓ విధంగా దీన్ని ‘21వ శతాబ్దపు రీమ్యాచ్’గా అభివర్ణించవచ్చు. ఆటగాళ్ల ఇష్టానికి అనుగుణంగా సౌకర్యాలు: ఈ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన హోటల్లో కేటాయించిన గదులు, వేదిక, ఇతర సౌకర్యాలపై ఆటగాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. చెస్ సామాగ్రే కాకుండా ఆటగాళ్లిద్దరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. చెస్ మేధావి కార్ల్సన్: ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే గతేడాది 21 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న కార్ల్సన్... అత్యంత చిన్న వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ అయిన ఘనత దక్కించుకున్నాడు. అభిమానులు, మీడియా దృష్టిలో అతడు చెస్ మేధావి. ముగింపు ఆటలో అత్యద్భుతమైన నైపుణ్యం తన సొంతం. అపార అనుభవం ఆనంద్ సొంతం: మూడు దశాబ్దాలుగా చెస్ క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ వస్తున్న ఆనంద్‌కు అనుభవమే పెట్టుబడి. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు వైవిధ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరుంది. అన్ని ఫార్మాట్ల (మ్యాచ్, టోర్నీ, నాకౌట్)లోనూ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా ఆనంద్‌కు పేరుంది. భారత తొలి గ్రాండ్‌మాస్టర్. అంచనాలను అందుకోలేక 2013లో టైటిల్‌ను కార్ల్‌సన్‌కు అప్పగించిన ఆనంద్ ఈసారి దెబ్బతిన్న పులిలా కసి మీదున్నాడు. పోటీ తీవ్రంగా ఉండే క్యాండిడేట్స్ టోర్నీని గెలుచుకోవడంతో పాటు బిల్బావో మాస్టర్ టోర్నీలోనూ విజేతగా నిలిచి సత్తా చాటుకున్నాడు. ఇదీ ఫార్మాట్ ఈ టోర్నీలో గరిష్టంగా 12 గేమ్‌లు జరుగుతాయి. ముందుగా 6.5 పాయింట్లు అంతకన్నా ఎక్కువగా సాధిస్తే వారే విజేతగా నిలుస్తారు. 12 గేమ్‌ల అనంతరం ఇరువురి స్కోర్లు సమంగా ఉంటే నాలుగు టై బ్రేక్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒక్కో ఆటగాడికి 25 నిమిషాలు కేటాయిస్తారు. ఇక్కడ కూడా మ్యాచ్ డ్రా అయితే ఐదేసి నిమిషాల గడువుతో రెండు గేమ్స్ ఆడతారు. ఎత్తు అనంతరం మూడు సెకన్ల సమయం ఉంటుంది. ఇక్కడా సమానంగా నిలిస్తే మరో రెండు గేమ్స్ ఆడిస్తారు. ఇలాంటి ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా విజేత ఎవరో తేలకుంటే ఒక సడెన్ డెత్ గేమ్‌ను ఆడించి నెగ్గిన వారికి టైటిల్ అందిస్తారు. విశేష ఆదరణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు 30 లక్షలకు పైగా ప్రత్యక్ష వీక్షకులు ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది చెస్ ఆటగాళ్లు ఉన్నారు. బిల్ గేట్స్, గోర్బచెవ్, జార్జి సోరోస్, సెర్గీ బ్రిన్లాంటి ప్రముఖులకు ఈ ఆటంటే తగని మక్కువ.