‘డ్రా'తో మొదలైంది...
సోచి (రష్యా): కొత్త ప్రయోగాలు చేయకుండా... సాహసోపేత ఎత్తులు వేయకుండా... ఆద్యంతం ఆచితూచి ఆడటంతో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ల మధ్య తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 48 ఎత్తుల ఆనంతరం గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేదని భావించిన ఆనంద్, కార్ల్‌సన్ ‘డ్రా’కు అంగీకరించారు.
గత ఏడాది ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో కార్ల్‌సన్‌పై ఒక్క గేమ్ కూడా గెలువలేకపోయిన ఆనంద్ ఈసారి తన వ్యూహాలకు మరింత పదును పెట్టుకొని బరిలోకి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెల్లపావులతో ఆరంభంలో ఆనంద్ వేసిన కొన్ని ఎత్తులకు సమాధానం ఇవ్వడానికి కార్ల్‌సన్ చాలా సమయమే తీసుకున్నాడు. గేమ్ మొదట్లో ఆనంద్‌దే పైచేయి కనిపించినా... పట్టుదలకు మారుపేరైన కార్ల్‌సన్ నెమ్మదిగా గేమ్‌లోకి వచ్చాడు.
24 ఎత్తులు ముగిసేసరికి కార్ల్‌సన్‌కే కాస్త అనుకూలత ఉన్నప్పటికీ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో గేమ్ ‘డ్రా’ దిశగా సాగింది. తన ప్రత్యర్థి పొరపాట్లు చేయాలని, దాని ద్వారా తాను లాభం పొందాలని కార్ల్‌సన్ శతవిధాలా ప్రయత్నించాడు. చివర్లో ఆనంద్‌కు ఇబ్బందికర పరిస్థితి తప్పదేమో అనిపించింది. అయితే కార్ల్‌సన్ 42వ ఎత్తులో తన ఏనుగును ఈ3 గడిలో బదులు ఈ2 గడిలోకి పంపించడంతో ఆనంద్‌కు ఊరట లభించింది. గేమ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో కార్ల్‌సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు.