చేజేతులా ఓడిన ఆనంద్
సోచి (రష్యా): నల్ల పావులతో ఆడుతున్నపుడు విజయావకాశాలు తక్కువగా వస్తాయి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తగిన ఫలితం వస్తుంది. సువర్ణావకాశం చేజారిందని తెలిస్తే... ఆ ప్రభావం ఆటపై పడి మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఆరో గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఎదురైంది.
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో ఆనంద్ చేజేతులా ఓడిపోయాడు. తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్ 37 ఎత్తుల్లో ఆనంద్‌పై గెలిచాడు. ఆరు గేమ్‌లు ముగిశాక కార్ల్‌సన్ 3.5-2.5తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం ఏడో గేమ్ జరుగుతుంది. ఇందులోనూ ఆనంద్ నల్లపావులతోనే ఆడతాడు.
ఆనంద్‌తో జరిగిన ఆరో గేమ్‌లోని 26వ ఎత్తులో కార్ల్‌సన్ ఘోరమైన తప్పిదం చేశాడు. తన రాజును డి2 గడిలోకి పంపాడు. కార్ల్‌సన్ చేసిన పొరపాటును ఆనంద్ గ్రహించి తదుపరి ఎత్తులో తన గుర్రంతో ఈ5లోని కార్ల్‌సన్ బంటును చంపిఉంటే ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తప్పకుండా గెలిచేవాడు.
కానీ ఆనంద్ ఈ సువర్ణావకాశాన్ని పసిగట్టకుండా కేవలం నిమిషంలోపే తన బంటును ఏ4లోకి పంపించి గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. ఆనంద్ చేసిన పొరపాటుతో కార్ల్‌సన్ ఊపిరి పీల్చుకొని మళ్లీ పుంజుకోవడమే కాకుండా గేమ్‌లోనూ విజయం సాధించాడు. ‘ప్రత్యర్థి నుంచి బహుమతి వస్తుందని ఆలోచనే లేనపుడు అది మనకు కనిపించదు’ అని తాను చేసిన తప్పిదంపై గేమ్ ముగిసిన తర్వాత ఆనంద్ వ్యాఖ్యానించాడు.
వేగమే ఆనంద్‌ను ముంచింది
గేమ్ ఆరంభంలో ఆనంద్ చాలా వేగంగా ఆడాడు. కార్ల్‌సన్ ఎత్తులకు బాగా సన్నద్ధమై వచ్చాడని అనిపించింది. అయినా గేమ్ మొదటి నుంచి కూడా వైట్స్‌తో ఆడిన కార్ల్‌సన్ ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. 26వ మూవ్ దగ్గర కార్ల్‌సన్ చాలా పెద్ద తప్పు చేశాడు. కానీ ఆనంద్ దానిని చూసుకోకుండా వేగంగా ఆడాడు. అక్కడ నైట్‌ను ఈ5లోకి పంపితే ఆనంద్ గేమ్ గెలిచేవాడు. ఆనంద్ స్థాయి ఆటగాడు కనీసం మూడు, నాలుగు నిమిషాలు ఆలోచించి ఉంటే సులభంగా దానిని కనిపెట్టేవాడు.
కానీ ఎందుకో వేగంగా మూవ్ ఆడి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కార్ల్‌సన్ వెంటనే తప్పు తెలుసుకుని మళ్లీ పుంజుకున్నాడు. గెలిచే అవకాశాన్ని వదులుకున్న విషయం ఆనంద్‌కు తర్వాత తెలిసింది. బహుశా ఇది ప్రభావం చూపిందేమో... అక్కడి నుంచి క్రమంగా పట్టు కోల్పోయి గేమ్ ఓడాడు. - హరికృష్ణ