the World Chess Championship
-
ఆనంద్‌కు చావోరేవో!
సోచి (రష్యా): పాయింట్ తేడాతో వెనుకంజ.. మిగిలినవి మరో రెండు గేమ్‌లు మాత్రమే... ఎలాంటి ఎత్తుగడ వేసినా ప్రత్యర్థి వద్ద నుంచి వస్తున్న దీటైన సమాధానం... మొత్తానికి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగే కీలకమైన 11వ గేమ్‌లో కార్ల్సన్ తెల్లపావులతో ఆడనుండటం ఆనంద్‌కు ప్రతికూలాంశమే. ఈ గేమ్‌లో గనుక ఆనంద్ ఓడితే కథ ముగిసినట్టే. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే చివరిదైన 12వ గేమ్‌లో ఆనంద్ తప్పనిసరిగా గెలవాలి. ఈ నేపథ్యంలో ఆనంద్‌కు 11వ గేమ్ తాడోపేడో లాంటిది. ‘డ్రా’గా ముగిసిన చివరి నాలుగు గేముల్లో ఆనంద్ పైచేయి సాధించినా వాటిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయాడు. -
6 గంటలు... 122 ఎత్తులు... ‘డ్రా'
ఏడో గేమ్‌లో కార్ల్‌సన్‌ను నిలువరించిన ఆనంద్ సోచి (రష్యా): సహనానికి పరాకాష్టగా నిలిచిన గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లోని ఏడో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఈ గేమ్‌లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తెల్లపావులతో ఆడి ఆధిపత్యం చలాయించినా ఆనంద్‌ను ఓడించలేకపోయాడు. సుమారు ఆరు గంటలకుపైగా 122 ఎత్తులపాటు సాగిన ఈ గేమ్‌ను ‘డ్రా’గా ముగించడంద్వారా ఆనంద్ తదుపరి గేమ్‌కు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. ఏడో రౌండ్ తర్వాత కార్ల్సన్ 4-3తో ఆధిక్యంలో ఉన్నాడు. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. బెర్లిన్ డిఫెన్స్‌లో ఏడో గేమ్‌ను మొదలుపెట్టిన కార్ల్సన్ ఆటతీరును విశ్లేషిస్తే కొన్నిసార్లు ఈ నార్వే ఆటగాడినే విజయం వరించేలా అనిపించింది. కానీ బెర్లిన్ డిఫెన్స్‌నే ఎంచుకున్న ఆనంద్ ఆద్యంతం పోరాడాడు. కార్ల్సన్ సహనాన్ని పరీక్షించాడు. ఒకదశలో ఎత్తులతో వీరిద్దరికి ఇచ్చిన స్కోరు షీట్ కూడా నిండిపోవడంతో కొత్త షీట్‌ను తీసుకున్నారు. ఆఖరికి ఆనంద్ వద్ద కేవలం రాజు... కార్ల్సన్ వద్ద గుర్రం, రాజు మిగిలాయి. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. ‘సాధారణంగా ఇంత సుదీర్ఘంగా 122 ఎత్తుల పాటు గేమ్ సాగడం అరుదు. 80 ఎత్తుల తర్వాత డ్రా అని అర్థం అయింది. ఎప్పుడైనా పావులు ఎక్కువగా ఉన్నవారే డ్రాకు ప్రతిపాదిస్తారు. ఈ గేమ్ మొత్తం కార్ల్‌సన్‌కు పావులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక ఫలితం రాదు అనే వరకు తను డ్రా ప్రతిపాదించలేదు. ఇంత సుదీర్ఘంగా ఆడటం వల్ల ఆనంద్ అలసిపోయేలా చేయాలనేది బహుశా కార్ల్సన్ ఆలోచన కావచ్చు. ఈ గేమ్‌లో మొదటి 24 గేమ్‌ల వరకూ ఇద్దరు ప్రిపేర్ అయి వచ్చారు. అయితే ఆనంద్ ఆ తర్వాత క్రమంగా మైనస్‌లోకి వెళ్లాడు. ఏమైనా చాలా కష్టం అనుకున్న గేమ్‌ను ఆనంద్ డ్రా చేయగలిగాడు. కార్ల్సన్ చాలా రకాలుగా విజయం కోసం ప్రయత్నించినా ఆనంద్ పోరాడాడు.’ - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్ -
చేజేతులా ఓడిన ఆనంద్
సోచి (రష్యా): నల్ల పావులతో ఆడుతున్నపుడు విజయావకాశాలు తక్కువగా వస్తాయి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తగిన ఫలితం వస్తుంది. సువర్ణావకాశం చేజారిందని తెలిస్తే... ఆ ప్రభావం ఆటపై పడి మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఆరో గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఎదురైంది. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో ఆనంద్ చేజేతులా ఓడిపోయాడు. తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ 37 ఎత్తుల్లో ఆనంద్‌పై గెలిచాడు. ఆరు గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 3.5-2.5తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం ఏడో గేమ్ జరుగుతుంది. ఇందులోనూ ఆనంద్ నల్లపావులతోనే ఆడతాడు. ఆనంద్‌తో జరిగిన ఆరో గేమ్‌లోని 26వ ఎత్తులో కార్ల్సన్ ఘోరమైన తప్పిదం చేశాడు. తన రాజును డి2 గడిలోకి పంపాడు. కార్ల్సన్ చేసిన పొరపాటును ఆనంద్ గ్రహించి తదుపరి ఎత్తులో తన గుర్రంతో ఈ5లోని కార్ల్సన్ బంటును చంపిఉంటే ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తప్పకుండా గెలిచేవాడు. కానీ ఆనంద్ ఈ సువర్ణావకాశాన్ని పసిగట్టకుండా కేవలం నిమిషంలోపే తన బంటును ఏ4లోకి పంపించి గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. ఆనంద్ చేసిన పొరపాటుతో కార్ల్సన్ ఊపిరి పీల్చుకొని మళ్లీ పుంజుకోవడమే కాకుండా గేమ్‌లోనూ విజయం సాధించాడు. ‘ప్రత్యర్థి నుంచి బహుమతి వస్తుందని ఆలోచనే లేనపుడు అది మనకు కనిపించదు’ అని తాను చేసిన తప్పిదంపై గేమ్ ముగిసిన తర్వాత ఆనంద్ వ్యాఖ్యానించాడు. వేగమే ఆనంద్‌ను ముంచింది గేమ్ ఆరంభంలో ఆనంద్ చాలా వేగంగా ఆడాడు. కార్ల్సన్ ఎత్తులకు బాగా సన్నద్ధమై వచ్చాడని అనిపించింది. అయినా గేమ్ మొదటి నుంచి కూడా వైట్స్‌తో ఆడిన కార్ల్సన్ ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. 26వ మూవ్ దగ్గర కార్ల్సన్ చాలా పెద్ద తప్పు చేశాడు. కానీ ఆనంద్ దానిని చూసుకోకుండా వేగంగా ఆడాడు. అక్కడ నైట్‌ను ఈ5లోకి పంపితే ఆనంద్ గేమ్ గెలిచేవాడు. ఆనంద్ స్థాయి ఆటగాడు కనీసం మూడు, నాలుగు నిమిషాలు ఆలోచించి ఉంటే సులభంగా దానిని కనిపెట్టేవాడు. కానీ ఎందుకో వేగంగా మూవ్ ఆడి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కార్ల్సన్ వెంటనే తప్పు తెలుసుకుని మళ్లీ పుంజుకున్నాడు. గెలిచే అవకాశాన్ని వదులుకున్న విషయం ఆనంద్‌కు తర్వాత తెలిసింది. బహుశా ఇది ప్రభావం చూపిందేమో... అక్కడి నుంచి క్రమంగా పట్టు కోల్పోయి గేమ్ ఓడాడు. - హరికృష్ణ -
ఆనంద్ పుంజుకుంటాడు
పెంటేల హరికృష్ణ తొలి గేమ్‌లో ఆనంద్కి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎండ్ గేమ్‌లో అది ‘డ్రా'గా వెళ్లింది. కొంచెం దూకుడుగా ఆడి ఉంటే తొలి గేమ్‌లో ఆనంద్ గెలిచేవాడు. రెండో గేమ్‌లో ఆనంద్ బెర్లిన్ డిఫెన్స్‌తో ఆట ప్రారంభించాడు. చెన్నైలో జరిగిన గత చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ నల్ల పావులతో తొలుత ఇదే ఎత్తుతో ఆడాడు. కార్ల్సన్ థియరీలోకి వెళ్లకుండా సైడ్ లైన్ ఎంచుకున్నాడు. దీని ద్వారా ఆనంద్‌ని తన ప్రిపరేషన్స్‌లో నుంచి బయటకు తీసుకెళ్లాలనేది కార్ల్సన్ ఆలోచన. నిజానికి చాలావరకు ఈ గేమ్ సమానంగా సాగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారుడు ఎవరైనా ‘డ్రా’కు అంగీకరించే స్థితిలో గేమ్ ఉన్నప్పుడు... కార్ల్సన్ అద్భుతం చేశాడు. రూక్ని ఎ3కి తీసుకెళ్లి కొత్త ప్రయోగం చేశాడు. ఇది అత్యద్భుతమైన ఆలోచన. దీనిని ఆనంద్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో అక్కడి నుంచి నెమ్మదిగా పట్టు కోల్పోయాడు. కార్ల్సన్ వేసిన ఈ ఒక్క ఎత్తు వల్ల అతనికి గేమ్‌లో అనేక ప్రత్యామ్నాయాలు కనిపించాయి. గతంలో గెల్ఫాండ్‌తో చాంపియన్‌షిప్‌లో ఆనంద్ తొలి గేమ్ ఓడిపోయాడు. కానీ పుంజుకుని టైటిల్ గెలిచాడు. కాబట్టి రెండో గేమ్ ఓటమి ప్రభావం ఆనంద్‌పై ఉండకపోవచ్చు. అయితే ఓడిపోయినప్పుడు సహజంగానే మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయిలో పాత ఫలితాన్ని చూసుకుంటే ముందుకు సాగడం కష్టం. ఇది ఆనంద్కి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మూడో రౌండ్లో ఆనంద్ మళ్లీ నల్లపావులతోనే ఆడతాడు. -
కొత్త వ్యూహాలతో...
కార్ల్సన్తో ఆనంద్ మూడో గేమ్ నేడు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): ప్రపంచ పోరుకు పక్కాగా సిద్ధమైనా... తొలి రెండు గేముల్లో అనుకున్నరీతిలో రాణించలేకపోయిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త వ్యూహాలపై దృష్టి సారించనున్నాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో మంగళవారం జరిగే మూడో గేమ్‌లో ఆనంద్ ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి రెండు గేముల్లో ఆరంభంలో చక్కగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత ప్రత్యర్థి కార్ల్సన్ ఎత్తులకు తగిన సమాధానం ఇవ్వలేకపోయాడు. తదుపరి గేముల్లోనూ కార్ల్సన్ ఎత్తులకు దీటుగా జవాబు ఇవ్వకపోతే ఆనంద్ ఈ 12 గేమ్‌ల ఈవెంట్లో కోలుకోవడం కష్టమే. -
‘డ్రా'తో మొదలైంది...
-
‘డ్రా'తో మొదలైంది...
సోచి (రష్యా): కొత్త ప్రయోగాలు చేయకుండా... సాహసోపేత ఎత్తులు వేయకుండా... ఆద్యంతం ఆచితూచి ఆడటంతో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ల మధ్య తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 48 ఎత్తుల ఆనంతరం గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేదని భావించిన ఆనంద్, కార్ల్సన్ ‘డ్రా’కు అంగీకరించారు. గత ఏడాది ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కార్ల్‌సన్‌పై ఒక్క గేమ్ కూడా గెలువలేకపోయిన ఆనంద్ ఈసారి తన వ్యూహాలకు మరింత పదును పెట్టుకొని బరిలోకి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెల్లపావులతో ఆరంభంలో ఆనంద్ వేసిన కొన్ని ఎత్తులకు సమాధానం ఇవ్వడానికి కార్ల్సన్ చాలా సమయమే తీసుకున్నాడు. గేమ్ మొదట్లో ఆనంద్‌దే పైచేయి కనిపించినా... పట్టుదలకు మారుపేరైన కార్ల్సన్ నెమ్మదిగా గేమ్‌లోకి వచ్చాడు. 24 ఎత్తులు ముగిసేసరికి కార్ల్‌సన్‌కే కాస్త అనుకూలత ఉన్నప్పటికీ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో గేమ్ ‘డ్రా’ దిశగా సాగింది. తన ప్రత్యర్థి పొరపాట్లు చేయాలని, దాని ద్వారా తాను లాభం పొందాలని కార్ల్సన్ శతవిధాలా ప్రయత్నించాడు. చివర్లో ఆనంద్‌కు ఇబ్బందికర పరిస్థితి తప్పదేమో అనిపించింది. అయితే కార్ల్సన్ 42వ ఎత్తులో తన ఏనుగును ఈ3 గడిలో బదులు ఈ2 గడిలోకి పంపించడంతో ఆనంద్‌కు ఊరట లభించింది. గేమ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో కార్ల్సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు. -
అనంద్ దెబ్బతిన్న పులి
ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో కార్ల్సన్... ఆనంద్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు. మళ్లీ ఈ పోరుకు అర్హత సాధించిన ఆనంద్... కార్ల్‌సన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్ ఈసారి రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం, శనివారం నుంచి గేమ్స్ జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్ గురించి తెలుగుతేజం, చెస్ స్టార్ పెంటేల హరికృష్ణ అందిస్తున్న ప్రివ్యూ... పెంటేల హరికృష్ణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం శనివారం ఆవిషృ్కతం కానుంది. 2013లో చెన్నైలో తలపడిన విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మరోసారి ఇక్కడ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రష్యాలోని సోచి నగరం ఇందుకు వేదిక కానుంది. ఓ విధంగా దీన్ని ‘21వ శతాబ్దపు రీమ్యాచ్’గా అభివర్ణించవచ్చు. ఆటగాళ్ల ఇష్టానికి అనుగుణంగా సౌకర్యాలు: ఈ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన హోటల్లో కేటాయించిన గదులు, వేదిక, ఇతర సౌకర్యాలపై ఆటగాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. చెస్ సామాగ్రే కాకుండా ఆటగాళ్లిద్దరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. చెస్ మేధావి కార్ల్సన్: ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే గతేడాది 21 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న కార్ల్సన్... అత్యంత చిన్న వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ అయిన ఘనత దక్కించుకున్నాడు. అభిమానులు, మీడియా దృష్టిలో అతడు చెస్ మేధావి. ముగింపు ఆటలో అత్యద్భుతమైన నైపుణ్యం తన సొంతం. అపార అనుభవం ఆనంద్ సొంతం: మూడు దశాబ్దాలుగా చెస్ క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ వస్తున్న ఆనంద్‌కు అనుభవమే పెట్టుబడి. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు వైవిధ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరుంది. అన్ని ఫార్మాట్ల (మ్యాచ్, టోర్నీ, నాకౌట్)లోనూ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా ఆనంద్‌కు పేరుంది. భారత తొలి గ్రాండ్‌మాస్టర్. అంచనాలను అందుకోలేక 2013లో టైటిల్‌ను కార్ల్‌సన్‌కు అప్పగించిన ఆనంద్ ఈసారి దెబ్బతిన్న పులిలా కసి మీదున్నాడు. పోటీ తీవ్రంగా ఉండే క్యాండిడేట్స్ టోర్నీని గెలుచుకోవడంతో పాటు బిల్బావో మాస్టర్ టోర్నీలోనూ విజేతగా నిలిచి సత్తా చాటుకున్నాడు. ఇదీ ఫార్మాట్ ఈ టోర్నీలో గరిష్టంగా 12 గేమ్‌లు జరుగుతాయి. ముందుగా 6.5 పాయింట్లు అంతకన్నా ఎక్కువగా సాధిస్తే వారే విజేతగా నిలుస్తారు. 12 గేమ్‌ల అనంతరం ఇరువురి స్కోర్లు సమంగా ఉంటే నాలుగు టై బ్రేక్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒక్కో ఆటగాడికి 25 నిమిషాలు కేటాయిస్తారు. ఇక్కడ కూడా మ్యాచ్ డ్రా అయితే ఐదేసి నిమిషాల గడువుతో రెండు గేమ్స్ ఆడతారు. ఎత్తు అనంతరం మూడు సెకన్ల సమయం ఉంటుంది. ఇక్కడా సమానంగా నిలిస్తే మరో రెండు గేమ్స్ ఆడిస్తారు. ఇలాంటి ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా విజేత ఎవరో తేలకుంటే ఒక సడెన్ డెత్ గేమ్‌ను ఆడించి నెగ్గిన వారికి టైటిల్ అందిస్తారు. విశేష ఆదరణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు 30 లక్షలకు పైగా ప్రత్యక్ష వీక్షకులు ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది చెస్ ఆటగాళ్లు ఉన్నారు. బిల్ గేట్స్, గోర్బచెవ్, జార్జి సోరోస్, సెర్గీ బ్రిన్లాంటి ప్రముఖులకు ఈ ఆటంటే తగని మక్కువ.