అనంద్ దెబ్బతిన్న పులి
ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో కార్ల్‌సన్... ఆనంద్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు. మళ్లీ ఈ పోరుకు అర్హత సాధించిన ఆనంద్... కార్ల్‌సన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్ ఈసారి రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం, శనివారం నుంచి గేమ్స్ జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్ గురించి తెలుగుతేజం, చెస్ స్టార్ పెంటేల హరికృష్ణ అందిస్తున్న ప్రివ్యూ...
పెంటేల హరికృష్ణ
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం శనివారం ఆవిషృ్కతం కానుంది. 2013లో చెన్నైలో తలపడిన విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) మరోసారి ఇక్కడ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రష్యాలోని సోచి నగరం ఇందుకు వేదిక కానుంది. ఓ విధంగా దీన్ని ‘21వ శతాబ్దపు రీమ్యాచ్’గా అభివర్ణించవచ్చు.
ఆటగాళ్ల ఇష్టానికి అనుగుణంగా సౌకర్యాలు: ఈ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన హోటల్‌లో కేటాయించిన గదులు, వేదిక, ఇతర సౌకర్యాలపై ఆటగాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. చెస్ సామాగ్రే కాకుండా ఆటగాళ్లిద్దరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు.
చెస్ మేధావి కార్ల్‌సన్: ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే గతేడాది 21 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న కార్ల్‌సన్... అత్యంత చిన్న వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ అయిన ఘనత దక్కించుకున్నాడు. అభిమానులు, మీడియా దృష్టిలో అతడు చెస్ మేధావి. ముగింపు ఆటలో అత్యద్భుతమైన నైపుణ్యం తన సొంతం.
అపార అనుభవం ఆనంద్ సొంతం: మూడు దశాబ్దాలుగా చెస్ క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ వస్తున్న ఆనంద్‌కు అనుభవమే పెట్టుబడి. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు వైవిధ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరుంది. అన్ని ఫార్మాట్ల (మ్యాచ్, టోర్నీ, నాకౌట్)లోనూ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా ఆనంద్‌కు పేరుంది.
భారత తొలి గ్రాండ్‌మాస్టర్. అంచనాలను అందుకోలేక 2013లో టైటిల్‌ను కార్ల్‌సన్‌కు అప్పగించిన ఆనంద్ ఈసారి దెబ్బతిన్న పులిలా కసి మీదున్నాడు. పోటీ తీవ్రంగా ఉండే క్యాండిడేట్స్ టోర్నీని గెలుచుకోవడంతో పాటు బిల్బావో మాస్టర్ టోర్నీలోనూ విజేతగా నిలిచి సత్తా చాటుకున్నాడు.
ఇదీ ఫార్మాట్
ఈ టోర్నీలో గరిష్టంగా 12 గేమ్‌లు జరుగుతాయి. ముందుగా 6.5 పాయింట్లు అంతకన్నా ఎక్కువగా సాధిస్తే వారే విజేతగా నిలుస్తారు. 12 గేమ్‌ల అనంతరం ఇరువురి స్కోర్లు సమంగా ఉంటే నాలుగు టై బ్రేక్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒక్కో ఆటగాడికి 25 నిమిషాలు కేటాయిస్తారు. ఇక్కడ కూడా మ్యాచ్ డ్రా అయితే ఐదేసి నిమిషాల గడువుతో రెండు గేమ్స్ ఆడతారు. ఎత్తు అనంతరం మూడు సెకన్ల సమయం ఉంటుంది. ఇక్కడా సమానంగా నిలిస్తే మరో రెండు గేమ్స్ ఆడిస్తారు. ఇలాంటి ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా విజేత ఎవరో తేలకుంటే ఒక సడెన్ డెత్ గేమ్‌ను ఆడించి నెగ్గిన వారికి టైటిల్ అందిస్తారు.
విశేష ఆదరణ
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు 30 లక్షలకు పైగా ప్రత్యక్ష వీక్షకులు ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది చెస్ ఆటగాళ్లు ఉన్నారు. బిల్ గేట్స్, గోర్బచెవ్, జార్జి సోరోస్, సెర్గీ బ్రిన్‌లాంటి ప్రముఖులకు ఈ ఆటంటే తగని మక్కువ.