6 గంటలు... 122 ఎత్తులు... ‘డ్రా'
ఏడో గేమ్‌లో కార్ల్‌సన్‌ను నిలువరించిన ఆనంద్
సోచి (రష్యా): సహనానికి పరాకాష్టగా నిలిచిన గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లోని ఏడో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఈ గేమ్‌లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) తెల్లపావులతో ఆడి ఆధిపత్యం చలాయించినా ఆనంద్‌ను ఓడించలేకపోయాడు.
సుమారు ఆరు గంటలకుపైగా 122 ఎత్తులపాటు సాగిన ఈ గేమ్‌ను ‘డ్రా’గా ముగించడంద్వారా ఆనంద్ తదుపరి గేమ్‌కు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. ఏడో రౌండ్ తర్వాత కార్ల్‌సన్ 4-3తో ఆధిక్యంలో ఉన్నాడు. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. బెర్లిన్ డిఫెన్స్‌లో ఏడో గేమ్‌ను మొదలుపెట్టిన కార్ల్‌సన్ ఆటతీరును విశ్లేషిస్తే కొన్నిసార్లు ఈ నార్వే ఆటగాడినే విజయం వరించేలా అనిపించింది.
కానీ బెర్లిన్ డిఫెన్స్‌నే ఎంచుకున్న ఆనంద్ ఆద్యంతం పోరాడాడు. కార్ల్‌సన్ సహనాన్ని పరీక్షించాడు. ఒకదశలో ఎత్తులతో వీరిద్దరికి ఇచ్చిన స్కోరు షీట్ కూడా నిండిపోవడంతో కొత్త షీట్‌ను తీసుకున్నారు. ఆఖరికి ఆనంద్ వద్ద కేవలం రాజు... కార్ల్‌సన్ వద్ద గుర్రం, రాజు మిగిలాయి. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు.
‘సాధారణంగా ఇంత సుదీర్ఘంగా 122 ఎత్తుల పాటు గేమ్ సాగడం అరుదు. 80 ఎత్తుల తర్వాత డ్రా అని అర్థం అయింది. ఎప్పుడైనా పావులు ఎక్కువగా ఉన్నవారే డ్రాకు ప్రతిపాదిస్తారు. ఈ గేమ్ మొత్తం కార్ల్‌సన్‌కు పావులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక ఫలితం రాదు అనే వరకు తను డ్రా ప్రతిపాదించలేదు. ఇంత సుదీర్ఘంగా ఆడటం వల్ల ఆనంద్ అలసిపోయేలా చేయాలనేది బహుశా కార్ల్‌సన్ ఆలోచన కావచ్చు.
ఈ గేమ్‌లో మొదటి 24 గేమ్‌ల వరకూ ఇద్దరు ప్రిపేర్ అయి వచ్చారు. అయితే ఆనంద్ ఆ తర్వాత క్రమంగా మైనస్‌లోకి వెళ్లాడు. ఏమైనా చాలా కష్టం అనుకున్న గేమ్‌ను ఆనంద్ డ్రా చేయగలిగాడు. కార్ల్‌సన్ చాలా రకాలుగా విజయం కోసం ప్రయత్నించినా ఆనంద్ పోరాడాడు.’ - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్