ఐదో గేమ్ డ్రా
ఆనంద్-కార్ల్‌సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుక్రవారం జరిగిన ఐదో గేమ్‌ను డ్రాగా ముగించాడు. సోచిలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంప్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడుతున్న ఆనంద్‌కు గెలిచే అవకాశం వ చ్చినా వినియోగించుకోలేకపోయాడు. 39 ఎత్తుల అనంతరం ఈ గేమ్ డ్రాగా ముగిసింది. కీలకమైన ఈ గేమ్‌లో ఆనంద్ నెగ్గితే కార్ల్‌సన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచినట్టయ్యేది. ఇప్పటిదాకా జరిగిన ఐదు గేమ్‌ల్లో ఇది మూడో డ్రా.
దీంతో చెరో విజయంతో ఇరువురు ఆటగాళ్లు 2.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా ఏడు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. తెల్ల పావులతో బరిలోకి దిగిన ఆనంద్ డి4 ఓపెనింగ్‌తో గేమ్‌ను ఆరంభించాడు. 20వ ఎత్తు వరకు గేమ్‌లో ఆనంద్ కాస్త ఆధిక్యాన్నే ప్రదర్శించాడు. టోర్నీలో మూడోసారి క్వీన్ పాన్‌తో ఆటను ఆరంభించిన కార్ల్‌సన్ ఈ గేమ్ కోసం బాగానే సన్నద్ధం అయినట్టు కనిపించింది.
తొలి గేమ్‌లో గ్రన్‌ఫీల్ట్ డిఫెన్స్‌ను ఉపయోగించుకున్న తను ఈ గేమ్‌లో మాత్రం క్వీన్ ఇండియన్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నాడు. 27వ ఎత్తు వద్ద ఆనంద్ రూక్‌ను ఎ4లోకి జరిపాడు. అలా కాకుండా బి7లోకి జరిపితే కొన్ని అవకాశాలు సృష్టించుకునే అవకాశం ఉండేది. ఇక ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడంతో గేమ్ డ్రాగా ముగిసింది. శనివారం ఆరో గేమ్‌లో కార్ల్‌సన్ తెల్ల పావులతో ఆడనున్నాడు.
‘ఆనంద్ తాను గెలిచిన మూడో గేమ్ తరహాలోనే ఐదో గేమ్‌ను ఆరంభించాడు. అయితే కార్ల్‌సన్ మాత్రం కొత్తదనాన్ని ప్రయతిస్తూ క్వీన్స్ ఇండియన్ డిఫెన్స్‌తో ఆరంభించాడు. గేమ్‌లో ఆనంద్ మరోసారి దూకుడుగా ఆడుతూ విజయం కోసమే ప్రయత్నించాడు. అయితే కార్ల్‌సన్ ఎండ్ గేమ్‌లో బాగా ఆడి ఆనంద్‌ను నిలువరించగలిగాడు. ఒకసారి మినహా గేమ్ మొత్తంలో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. టోర్నమెంట్‌లో ఎప్పుడైనా మధ్య గేమ్‌లు కీలకం. ఇవే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు 6, 7 గేమ్‌లలో కార్ల్‌సన్ తెల్ల పావులతో ఆడనున్నాడు. అతను దీనిని పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆనంద్ జాగ్రత్తతో ఉండటం అవసరం. ఇక్కడ తేడా వస్తే కోలుకోవడం కష్టం.’ - హరికృష్ణ