Magnus Carlsson
-
మళ్లీ పంచుకున్నారు
సోచి (రష్యా): టైటిల్ ఆశలు నిలవాలంటే విజయం అవసరమైన చోట భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. ఆనంద్ వ్యూహాలకు తగిన సమాధానమిస్తూ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య శుక్రవారం జరిగిన పదో రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. ప్రస్తుతం కార్ల్సన్ 5.5-4.5తో ఆధిక్యంలో ఉన్నాడు. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే 11వ గేమ్‌లో తెల్లపావులతో ఆడనున్న కార్ల్సన్ గెలిస్తే మరో గేమ్ మిగిలి ఉండగానే అతనికి టైటిల్ ఖాయమవుతుంది. ఈ ఈవెంట్లో ఐదోసారి తెల్లపావులతో ఆడిన ఆనంద్ గ్రున్‌ఫెల్డ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను మొదలుపెట్టాడు. తొలి 11 ఎత్తుల్లో వీరిద్దరూ దేనికి కూడా నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోలేకపోవడం వారిద్దరు ఎంత పక్కాగా సిద్ధమై వచ్చారో తెలుపుతోంది. ఒక దశలో ఆనంద్ కాస్త పైచేయి సాధించినట్లు కనిపించింది. 19వ ఎత్తులో ఆనంద్ గుర్రాన్ని జీ5 గడిలోకి పంపించాడు. ఆనంద్ వ్యూహమేమిటో అర్థంకాని కార్ల్సన్ దీనికి సమాధానం ఇవ్వడానికి ఏకంగా 33 నిమిషాల 49 సెకన్లు వెచ్చించి... తన ఒంటెను బీ4 గడిలోకి పంపించాడు. ఆ తర్వాత రెండు ఎత్తులకు... కార్ల్సన్ ఘోరమైన తప్పిదం చేస్తే తప్ప ఈ గేమ్‌లో ఆనంద్ నెగ్గడం సాధ్యం కాని పరిస్థితి తలెత్తింది. దాంతో 32 ఎత్తుల తర్వాత ఇద్దరూ ‘డ్రా'కు అంగీకరించారు. -
6 గంటలు... 122 ఎత్తులు... ‘డ్రా'
ఏడో గేమ్‌లో కార్ల్‌సన్‌ను నిలువరించిన ఆనంద్ సోచి (రష్యా): సహనానికి పరాకాష్టగా నిలిచిన గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లోని ఏడో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఈ గేమ్‌లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తెల్లపావులతో ఆడి ఆధిపత్యం చలాయించినా ఆనంద్‌ను ఓడించలేకపోయాడు. సుమారు ఆరు గంటలకుపైగా 122 ఎత్తులపాటు సాగిన ఈ గేమ్‌ను ‘డ్రా’గా ముగించడంద్వారా ఆనంద్ తదుపరి గేమ్‌కు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. ఏడో రౌండ్ తర్వాత కార్ల్సన్ 4-3తో ఆధిక్యంలో ఉన్నాడు. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. బెర్లిన్ డిఫెన్స్‌లో ఏడో గేమ్‌ను మొదలుపెట్టిన కార్ల్సన్ ఆటతీరును విశ్లేషిస్తే కొన్నిసార్లు ఈ నార్వే ఆటగాడినే విజయం వరించేలా అనిపించింది. కానీ బెర్లిన్ డిఫెన్స్‌నే ఎంచుకున్న ఆనంద్ ఆద్యంతం పోరాడాడు. కార్ల్సన్ సహనాన్ని పరీక్షించాడు. ఒకదశలో ఎత్తులతో వీరిద్దరికి ఇచ్చిన స్కోరు షీట్ కూడా నిండిపోవడంతో కొత్త షీట్‌ను తీసుకున్నారు. ఆఖరికి ఆనంద్ వద్ద కేవలం రాజు... కార్ల్సన్ వద్ద గుర్రం, రాజు మిగిలాయి. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. ‘సాధారణంగా ఇంత సుదీర్ఘంగా 122 ఎత్తుల పాటు గేమ్ సాగడం అరుదు. 80 ఎత్తుల తర్వాత డ్రా అని అర్థం అయింది. ఎప్పుడైనా పావులు ఎక్కువగా ఉన్నవారే డ్రాకు ప్రతిపాదిస్తారు. ఈ గేమ్ మొత్తం కార్ల్‌సన్‌కు పావులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక ఫలితం రాదు అనే వరకు తను డ్రా ప్రతిపాదించలేదు. ఇంత సుదీర్ఘంగా ఆడటం వల్ల ఆనంద్ అలసిపోయేలా చేయాలనేది బహుశా కార్ల్సన్ ఆలోచన కావచ్చు. ఈ గేమ్‌లో మొదటి 24 గేమ్‌ల వరకూ ఇద్దరు ప్రిపేర్ అయి వచ్చారు. అయితే ఆనంద్ ఆ తర్వాత క్రమంగా మైనస్‌లోకి వెళ్లాడు. ఏమైనా చాలా కష్టం అనుకున్న గేమ్‌ను ఆనంద్ డ్రా చేయగలిగాడు. కార్ల్సన్ చాలా రకాలుగా విజయం కోసం ప్రయత్నించినా ఆనంద్ పోరాడాడు.’ - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్ -
ఆరోగేమ్ లో ఆనంద్ పై కార్ల్ సన్ విజయం
సోచి: ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు మరో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన ఆరోగేమ్ లో ఆనంద్ పై ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ విజయం సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ రోజు తెల్లపావులతో ఆడిన కార్ల్ సన్ ఎత్తులకు ఆనంద్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో 12 గేమ్ ల చాంపియన్ షిప్ లో కార్ల్ సన్ 3.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆనంద్ 2.5 పాయింట్లతో వెనుకబడ్డాడు. అంతకుముందు కార్ల్ సన్ రెండో గేమ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ జరిగిన గేమ్ లలో తొలి, నాలుగు, ఐదు గేమ్ లు డ్రా అవ్వగా, మూడో గేమ్ లో మాత్రమే ఆనంద్ కు విజయం దక్కింది. -
ఐదో గేమ్ డ్రా
ఆనంద్-కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుక్రవారం జరిగిన ఐదో గేమ్‌ను డ్రాగా ముగించాడు. సోచిలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో డిఫెండింగ్ చాంప్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడుతున్న ఆనంద్‌కు గెలిచే అవకాశం వ చ్చినా వినియోగించుకోలేకపోయాడు. 39 ఎత్తుల అనంతరం ఈ గేమ్ డ్రాగా ముగిసింది. కీలకమైన ఈ గేమ్‌లో ఆనంద్ నెగ్గితే కార్ల్‌సన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచినట్టయ్యేది. ఇప్పటిదాకా జరిగిన ఐదు గేమ్‌ల్లో ఇది మూడో డ్రా. దీంతో చెరో విజయంతో ఇరువురు ఆటగాళ్లు 2.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా ఏడు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. తెల్ల పావులతో బరిలోకి దిగిన ఆనంద్ డి4 ఓపెనింగ్‌తో గేమ్‌ను ఆరంభించాడు. 20వ ఎత్తు వరకు గేమ్‌లో ఆనంద్ కాస్త ఆధిక్యాన్నే ప్రదర్శించాడు. టోర్నీలో మూడోసారి క్వీన్ పాన్‌తో ఆటను ఆరంభించిన కార్ల్సన్ ఈ గేమ్ కోసం బాగానే సన్నద్ధం అయినట్టు కనిపించింది. తొలి గేమ్‌లో గ్రన్ఫీల్ట్ డిఫెన్స్‌ను ఉపయోగించుకున్న తను ఈ గేమ్‌లో మాత్రం క్వీన్ ఇండియన్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నాడు. 27వ ఎత్తు వద్ద ఆనంద్ రూక్‌ను ఎ4లోకి జరిపాడు. అలా కాకుండా బి7లోకి జరిపితే కొన్ని అవకాశాలు సృష్టించుకునే అవకాశం ఉండేది. ఇక ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడంతో గేమ్ డ్రాగా ముగిసింది. శనివారం ఆరో గేమ్‌లో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడనున్నాడు. ‘ఆనంద్ తాను గెలిచిన మూడో గేమ్ తరహాలోనే ఐదో గేమ్‌ను ఆరంభించాడు. అయితే కార్ల్సన్ మాత్రం కొత్తదనాన్ని ప్రయతిస్తూ క్వీన్స్ ఇండియన్ డిఫెన్స్‌తో ఆరంభించాడు. గేమ్‌లో ఆనంద్ మరోసారి దూకుడుగా ఆడుతూ విజయం కోసమే ప్రయత్నించాడు. అయితే కార్ల్సన్ ఎండ్ గేమ్‌లో బాగా ఆడి ఆనంద్‌ను నిలువరించగలిగాడు. ఒకసారి మినహా గేమ్ మొత్తంలో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. టోర్నమెంట్లో ఎప్పుడైనా మధ్య గేమ్‌లు కీలకం. ఇవే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు 6, 7 గేమ్‌లలో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడనున్నాడు. అతను దీనిని పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆనంద్ జాగ్రత్తతో ఉండటం అవసరం. ఇక్కడ తేడా వస్తే కోలుకోవడం కష్టం.’ - హరికృష్ణ -
‘డ్రా'నందం
సోచి (రష్యా): మూడో గేమ్‌లో విజయం అందించిన ఉత్సాహంతో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో బుధవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు 2-2 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం ఐదో రౌండ్ గేమ్ జరుగుతుంది. మూడో గేమ్‌లో ఎదురైన ఓటమితో ఈసారి కార్ల్సన్ ఆచితూచి ఎత్తులతో స్పందించాడు. మరీ దూకుడుగా ఆడకుండా సంయమనంతో ఎత్తులు వేశాడు. కార్ల్సన్ ప్రతి ఎత్తుకు ఆనంద్ తగిన సమాధానమిస్తూ ముందుకుసాగాడు. ఈ గేమ్‌లో ఏదశలోనూ ఇద్దరికీ విజయావకాశాలు లభించలేదు.