మళ్లీ పంచుకున్నారు
సోచి (రష్యా): టైటిల్ ఆశలు నిలవాలంటే విజయం అవసరమైన చోట భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. ఆనంద్ వ్యూహాలకు తగిన సమాధానమిస్తూ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ టైటిల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు.
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య శుక్రవారం జరిగిన పదో రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. ప్రస్తుతం కార్ల్‌సన్ 5.5-4.5తో ఆధిక్యంలో ఉన్నాడు. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే 11వ గేమ్‌లో తెల్లపావులతో ఆడనున్న కార్ల్‌సన్ గెలిస్తే మరో గేమ్ మిగిలి ఉండగానే అతనికి టైటిల్ ఖాయమవుతుంది.
ఈ ఈవెంట్‌లో ఐదోసారి తెల్లపావులతో ఆడిన ఆనంద్ గ్రున్‌ఫెల్డ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను మొదలుపెట్టాడు. తొలి 11 ఎత్తుల్లో వీరిద్దరూ దేనికి కూడా నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోలేకపోవడం వారిద్దరు ఎంత పక్కాగా సిద్ధమై వచ్చారో తెలుపుతోంది. ఒక దశలో ఆనంద్ కాస్త పైచేయి సాధించినట్లు కనిపించింది. 19వ ఎత్తులో ఆనంద్ గుర్రాన్ని జీ5 గడిలోకి పంపించాడు.
ఆనంద్ వ్యూహమేమిటో అర్థంకాని కార్ల్‌సన్ దీనికి సమాధానం ఇవ్వడానికి ఏకంగా 33 నిమిషాల 49 సెకన్లు వెచ్చించి... తన ఒంటెను బీ4 గడిలోకి పంపించాడు. ఆ తర్వాత రెండు ఎత్తులకు... కార్ల్‌సన్ ఘోరమైన తప్పిదం చేస్తే తప్ప ఈ గేమ్‌లో ఆనంద్ నెగ్గడం సాధ్యం కాని పరిస్థితి తలెత్తింది. దాంతో 32 ఎత్తుల తర్వాత ఇద్దరూ ‘డ్రా'కు అంగీకరించారు.