ఆనంద్ పుంజుకుంటాడు
పెంటేల హరికృష్ణ
తొలి గేమ్‌లో ఆనంద్‌కి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎండ్ గేమ్‌లో అది ‘డ్రా'గా వెళ్లింది. కొంచెం దూకుడుగా ఆడి ఉంటే తొలి గేమ్‌లో ఆనంద్ గెలిచేవాడు. రెండో గేమ్‌లో ఆనంద్ బెర్లిన్ డిఫెన్స్‌తో ఆట ప్రారంభించాడు. చెన్నైలో జరిగిన గత చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ నల్ల పావులతో తొలుత ఇదే ఎత్తుతో ఆడాడు. కార్ల్‌సన్ థియరీలోకి వెళ్లకుండా సైడ్ లైన్ ఎంచుకున్నాడు. దీని ద్వారా ఆనంద్‌ని తన ప్రిపరేషన్స్‌లో నుంచి బయటకు తీసుకెళ్లాలనేది కార్ల్‌సన్ ఆలోచన.
నిజానికి చాలావరకు ఈ గేమ్ సమానంగా సాగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారుడు ఎవరైనా ‘డ్రా’కు అంగీకరించే స్థితిలో గేమ్ ఉన్నప్పుడు... కార్ల్‌సన్ అద్భుతం చేశాడు. రూక్‌ని ఎ3కి తీసుకెళ్లి కొత్త ప్రయోగం చేశాడు. ఇది అత్యద్భుతమైన ఆలోచన. దీనిని ఆనంద్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో అక్కడి నుంచి నెమ్మదిగా పట్టు కోల్పోయాడు. కార్ల్‌సన్ వేసిన ఈ ఒక్క ఎత్తు వల్ల అతనికి గేమ్‌లో అనేక ప్రత్యామ్నాయాలు కనిపించాయి. గతంలో గెల్ఫాండ్‌తో చాంపియన్‌షిప్‌లో ఆనంద్ తొలి గేమ్ ఓడిపోయాడు. కానీ పుంజుకుని టైటిల్ గెలిచాడు.
కాబట్టి రెండో గేమ్ ఓటమి ప్రభావం ఆనంద్‌పై ఉండకపోవచ్చు. అయితే ఓడిపోయినప్పుడు సహజంగానే మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయిలో పాత ఫలితాన్ని చూసుకుంటే ముందుకు సాగడం కష్టం. ఇది ఆనంద్‌కి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మూడో రౌండ్‌లో ఆనంద్ మళ్లీ నల్లపావులతోనే ఆడతాడు.