pentela Hari Krishna
-
International Chess Tourney: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బుకారెస్ట్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ కాంస్య పతకం సాధించాడు. రొమేనియాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత మాక్సిమ్ చిగయెవ్ (రష్యా), డేనియల్ బొగ్డాన్ (రొమేనియా), హరికృష్ణ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. చిగయెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... బొగ్డాన్కు రెండో ర్యాంక్, హరికృష్ణకు మూడో ర్యాంక్ లభించాయి. హరికృష్ణ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రౌనక్‌తో జరిగిన గేమ్‌లో ఓడిపోయాడు. -
రన్నరప్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన తొలి ముఖాముఖి అంతర్జాతీయ టోర్నమెంట్ బీల్ చెస్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో బుధవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ 36.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 37 పాయింట్లతో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా వొజ్తాసెక్ ఓవరాల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్ విభాగాల్లో టోర్నీలు నిర్వహించి... ఈ మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా ఫైనల్ ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. హరికృష్ణ ర్యాపిడ్ విభాగంలో 10 పాయింట్లు ... బ్లిట్జ్ విభాగంలో 6 పాయింట్లు... క్లాసికల్ విభాగంలో 20.5 పాయింట్లు స్కోరు చేశాడు. బుధవారం జరిగిన చివరిదైన ఏడో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ హరికృష్ణ 31 ఎత్తుల్లో డేవిడ్ గిజారో (స్పెయిన్)పై గెలుపొందాడు. అయితే మరోవైపు వొజ్తాసెక్ కూడా తన చివరి రౌండ్ గేమ్‌లో తన ప్రత్యర్థి నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్)ను ఓడించడంతో హరికృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వొజ్తాసెక్ గేమ్ ‘డ్రా’ అయిఉంటే హరికృష్ణకు టైటిల్ లభించేంది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ విభాగంలో విజయానికి 4 పాయింట్లు, ‘డ్రా’కు ఒకటిన్నర పాయింట్లు... ర్యాపిడ్ విభాగంలో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్... బ్లిట్జ్ విభాగంలో విజయానికి 1 పాయింట్, ‘డ్రా’కు అరపాయింట్ కేటాయించారు. చాంపియన్ వొజ్తాసెక్కు 10 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 8 లక్షల 20 వేలు), రన్నరప్ హరికృష్ణకు 7,500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 6 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్ ఫైనల్ ర్యాంకింగ్స్ 1. రాడోస్లా వొజ్తాసెక్ (పోలాండ్–37 పాయింట్లు); 2. పెంటేల హరికృష్ణ (భారత్–36.5 పాయింట్లు); 3. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్–35.5 పాయింట్లు); 4. విన్సెంట్ కీమెర్ (జర్మనీ–28 పాయింట్లు); 5. అర్కాదిజ్ నైదిష్ (అజర్బైజాన్–22.5 పాయింట్లు); 6. డేవిడ్ గిజారో (స్పెయిన్–22 పాయింట్లు); 7. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్–17.5 పాయింట్లు); 8. నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్–15 పాయింట్లు). ఆడటంలోనే ఆనందం దక్కింది... బీల్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం సంతోషం. త్రుటిలో ఓవరాల్ చాంపియన్‌షిప్ కోల్పోయాను. అయితే ఎలాంటి నిరాశా లేదు. మూడు ఫార్మాట్లలో (ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్) కూడా బాగా ఆడాను. బ్లిట్జ్‌లో మాత్రం కాస్త వెనుకబడటంతో ఓవరాల్ టైటిల్ చేజారింది. మొత్తంగా నా ప్రదర్శన అయితే చాలా బాగుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ విజయాలు, ఫలితాలకంటే ముఖాముఖి చెస్ ఆడటంలో నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. ఫిబ్రవరిలో చివరి టోర్నమెంట్ బరిలోకి దిగాను. బీల్ నుంచి ‘సాక్షి’తో హరికృష్ణ ► కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మా టోర్నీలు కూడా రద్దు కావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో అనేక కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఓపెనింగ్స్‌పై ఒక పుస్తకం కూడా రాశాను. త్వరలో అది ప్రచురితమవుతుంది. ► ప్రస్తుతం ప్రాగ్ (చెక్ రిపబ్లిక్ రాజధాని)లో ఉంటున్నా. కరోనాకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా పాటించారు. మాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వారే చూసుకోవడం వల్ల మేం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్లిట్జ్ మినహా మిగిలిన ఫార్మాట్లకు ఇద్దరు ఆటగాళ్ల మధ్య మందమైన ప్లాస్టిక్ తెరలాంటిది ఉంచారు. బ్లిట్జ్ చాలా వేగంగా ముగిసిపోతుంది కాబట్టి మాస్క్‌లు వేసుకొని ఆడామంతే. ► కరోనా విరామం సమయంలో మూడు ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొన్నాను. అయితే అవి నాకు సంతృప్తినివ్వలేదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. ఆన్లైన్ ఆడగలిగే అవకాశం చెస్‌కు ఉన్నా... ఎదురుగా మరో ఆటగాడు కూర్చొని ఉంటేనే ఆ అనుభూతి లభిస్తుంది. ప్రత్యర్థిని చూస్తూ, అతని ముఖకవళికలను పరిశీలించడం కూడా చెస్ వ్యూహప్రతివ్యూహాల్లో భాగమే. అందుకే బీల్ నిర్వాహకులు పిలవగానే ఆడేందుకు సిద్ధమయ్యా. ► మొత్తంగా బీల్ టోర్నీ భిన్నమైన అనుభవమే అయినా మరీ కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు సంతృప్తిగా వెనుదిరుగుతున్నా. ఇప్పుడు ఒలింపియాడ్ కోసం సన్నద్ధమవుతా. భారత్ ఉన్న గ్రూప్ మ్యాచ్‌లు ఆగస్టు 19 నుంచి ఉన్నాయి కాబట్టి నాకు తగినంత సమయం ఉంది. ఒలింపియాడ్ కూడా తొలిసారి ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. జట్టుగా ఇది ఎలా ఉండబోతోందో అని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. -
‘క్యాండిడేట్స్’కు అర్హతే లక్ష్యం
♦ గ్రాండ్‌ప్రి’లతో మంచి అవకాశం ♦ ఇది నా కెరీర్లో అత్యుత్తమ దశ ♦ ‘సాక్షి’తో గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ భారత చెస్ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటి ఆటకు మరింత గుర్తింపు తెచ్చిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. సుదీర్ఘ కాలంగా నిలకడగా విజయాలు సాధిస్తున్న ఈ తెలుగు ఆటగాడి కెరీర్ ఇటీవల మరింత ఊపందుకుంది. కొద్ది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే అందుకోగలిగిన 2770 రేటింగ్‌కు ఇటీవలే హరికృష్ణ చేరుకోవడం పెద్ద విశేషం. ప్రస్తుతం ఆటపరంగా తన అత్యుత్తమ దశలో ఉన్నానని హరి చెబుతున్నాడు. తన ప్రదర్శన, భవిష్యత్తు టోర్నీలు తదితర అంశాలపై ‘సాక్షి’ క్రీడా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వూ్య విశేషాలు అతని మాటల్లోనే... 2770 రేటింగ్ సాధించడంపై... ప్రస్తుత అంతర్జాతీయ చెస్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే 2770 రేటింగ్‌ను అరుదైన ఘనతగా చెప్పవచ్చు. దీనిని సాధించడం ద్వారా తక్కువ మందికే చోటున్న ‘ఎలైట్’ గ్రూప్‌కి చేరుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ రేటింగ్ కారణంగా ఎప్పుడో ఒకసారి టాప్ ప్లేయర్‌తో తలపడటం కాకుండా ఇక తరచుగా అగ్రస్థాయి టోర్నీలలో నేను వారిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్కడ మంచి విజయాలు లభిస్తే దానికి దక్కే గుర్తింపు, విలువ చాలా ఎక్కువ. ఇటీవలి ప్రదర్శనపై... ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరీర్లో ఇది అత్యుత్తమ దశ. రేటింగ్‌తో పాటు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి అడుగు పెట్టాను. గత రెండేళ్లుగా నేను పడిన శ్రమకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చైనా టోర్నీలో రెండో స్థానంలో నిలవగా, ఒలింపియాడ్‌లో నాలుగో స్థానంతో త్రుటిలో పతకం చేజారింది. 2016 నుంచి ఓపెన్, లీగ్ టోర్నీలను చాలా వరకు తగ్గించి ప్రధాన టోర్నమెంట్లపై దృష్టి పెట్టాను. టాటా స్టీల్ టోర్నీలో కొన్ని సార్లు విజయావకాశాలు లభించినా వాటిని ఉపయోగించుకోలేకపోవడంతో తుది ఫలితం గొప్పగా లేదు. వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం చెప్పుకోదగ్గ అంశం. ఒక్క రోజే అయినా... ఆనంద్‌ను కూడా ర్యాంకుల్లో అధిగమించగలగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది! భారత్‌లో చెస్ పురోగతిపై... దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా వేగంగా భారత చెస్ ఎదుగుతోంది. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య పెరగడం ఒక్కటే కాదు, ఆటగాళ్ల పరిజ్ఞానం కూడా చాలా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవడం వల్ల ఆట వ్యూహాల్లో కూడా కొత్త తరహాలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దీని వల్ల పోటీ కూడా పెరిగింది. ఓవరాల్‌గా సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తే చాలా మెరుగైందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. తదుపరి లక్ష్యాలపై... 2017 నా కెరీర్లో కీలక సంవత్సరం కానుంది. వచ్చే నెలలో చైనా, అజర్బైజాన్లలో రెండు పెద్ద టోర్నమెంట్లు ఉన్నాయి. అంతకంటే ప్రధానమైనవి ఈ ఏడాది జరిగే మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలు. ఈ మూడు టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే లేదా సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచకప్‌లోనైనా ఫైనల్ చేరితే క్యాండిడేట్స్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాను. ప్రస్తుతం నా లక్ష్యం అదే. ప్రపంచంలోని టాప్–8 ఆటగాళ్లు మాత్రమే తలపడే క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొనడం అన్నింటికంటే ముఖ్యం. ఆ టోర్నీ విజేతకు వరల్డ్ చాంపియన్‌ను ఢీకొట్టే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నా సన్నాహకాలు, ఫామ్ చాలా బాగున్నాయని, సరైన దిశలోనే వెళుతున్నానని నమ్ముతున్నా. గతంలో నాలో ఉన్న ఓపెనింగ్ లోపాలను ఇప్పటికే సరిదిద్దుకున్నా. నా ముగ్గురు సహాయకులు (సెకండ్స్) రాబోయే టోర్నీల సన్నద్ధతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ టోర్నీలలో పాల్గొనకపోవడంపై... నేను ఆఖరిసారిగా భారత్‌లో 2004లో ఆడాను. దురదృష్టవశాత్తూ మన దేశంలో పెద్ద స్థాయి టోర్నీల నిర్వహణ విషయంలో ఫెడరేషన్ చొరవ తీసుకోవడం లేదు. ఆదరణ ఉండదు, స్పాన్సర్లు రారు అనడంలో వాస్తవం లేదు. ఇటీవల క్రికెటేతర క్రీడలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో చెస్‌ను కూడా అనుసరించేవారు బాగా పెరిగారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. నిజానికి ఫెడరేషన్లో వేల సంఖ్యలో ఉన్న రిజిస్టర్డ్ ఆటగాళ్లు సదరు టోర్నీని అనుసరించినా అది సక్సెస్ అయినట్లే! ఇక నేను, ఆనంద్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనకపోవడానికి తగినంత పోటీ లేకపోవడమే కారణం. మా రేటింగ్‌కు కాస్త అటూ ఇటుగా ఉన్న ఆటగాళ్లతో పర్వాలేదు గానీ మరీ తక్కువ స్థాయి ఆటగాళ్లతో తలపడితే మాకు ప్రయోజనంకంటే నష్టమే ఎక్కువ. గతంలో మన దేశంలో పలుసార్లు జరిగిన నిర్వహణా లోపాలు కూడా మమ్మల్ని ఆడకుండా నిరోధిస్తున్నాయి. -
ప్రపంచ కప్‌లో హరికృష్ణకు చుక్కెదురు
బాకు (అజర్బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నిష్ర్కమించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ సేతురామన్‌తో జరిగిన రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ చెస్ ప్లేయర్ 0.5-1.5 తేడాతో ఓడిపోయాడు. సోమవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. హరికృష్ణ ఓటమితో ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి సేతురామన్ ఒక్కడే బరిలో మిగిలాడు. ఈ టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, లలిత్ బాబు, విదిత్ గుజరాతీ, ఆధిబన్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యారు. -
20 ఎత్తుల్లో... గంటలోనే...
* ఆనంద్, కార్ల్సన్ తొమ్మిదో గేమ్ డ్రా * ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మరో డ్రా. అయితే ఈసారి కేవలం 20 ఎత్తుల్లోనే, అది కూడా గంటలోనే ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ బెర్లిన్ డిఫెన్స్‌తోనే గేమ్ ప్రారంభించాడు. 12 మూవ్‌ల వరకూ ఇద్దరూ గతంలో ఆడిన ఎత్తులనే ఆడారు. ఆ తర్వాత నాలుగు మూవ్స్ మాత్రమే కొత్తగా వేశారు. దీంతో 16వ ఎత్తు వద్దే ఈ గేమ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది. ఆ తర్వాత మూడు ఎత్తులు కూడా పునరావృతం కావడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. ఈ గేమ్‌లో ఆనంద్ పెద్దగా ఆలోచించలేదు కూడా. కేవలం 12 నిమిషాల్లోనే తన 19 ఎత్తులు వేశాడు. తను ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమయ్యాడనడానికి ఇది ఉదాహరణ. చాంపియన్‌షిప్‌లో ఇది వరుసగా మూడో డ్రా కావడం విశేషం. తొమ్మిదో గేమ్ తర్వాత కార్ల్సన్ 5-4 పాయింట్లతో ఆనంద్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం జరిగే పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. నిరాశ కలిగించిన రోజు పెంటేల హరికృష్ణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లాంటి పెద్ద మ్యాచ్‌లో ఓ గేమ్ కేవలం 20 ఎత్తుల్లోనే డ్రా కావడం అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుంది. కార్ల్సన్ ఆరంభంలో కొత్త వేరియేషన్‌తో ఆడాడు. కానీ ఆనంద్ ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమై వచ్చాడు. దీంతో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. 16 ఎత్తుల తర్వాత ఇక ఎంతసేపు ఆడినా ఎత్తులు పునరావృతం కావడం మినహా మరో దారి లేదు. ఎవరైనా విజయం కోసం ప్రయత్నిస్తే వాళ్లు కచ్చితంగా ఇబ్బందుల్లోకి వెళతారు. అందుకే రిస్క్ తీసుకోకుండా ఇద్దరూ డ్రాకే మొగ్గు చూపారు. ఇది ఆనంద్‌కు మంచి ఫలితం అనుకోవాలి. నాలుగో గేమ్‌లో మినహా ఆనంద్ ప్రతిసారీ బ్లాక్స్‌తో ఆడేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఈసారి మాత్రం సులభంగా డ్రా చేసుకున్నాడు. దీనికి కారణం బాగా సన్నద్ధమవడమే. పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ గేమ్ కచ్చితంగా గెలవాలని కాదుగానీ... పదో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేస్తే... చివరి రెండు గేమ్‌లు మరింత ఆసక్తిక రంగా సాగుతాయి. బ్లాక్స్‌తో గంటలోనే డ్రా చేసుకుంటే ఏ ఆటగాడికైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆనంద్ తర్వాతి గేమ్ బాగా ఆడతాడని అనుకుంటున్నా. చెస్ గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణను harichess@twitter లో ఫాలో కావచ్చు -
ఇది ఆనంద్‌లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది
(పెంటేల హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్) కార్ల్సన్ ఈసారి ఓపెనింగ్‌కు సిసిలియన్ డిఫెన్స్‌ను, ఎప్పటిలాగే సైడ్లైన్ను ఎంచుకున్నాడు. పెద్దగా అటాకింగ్‌కు ఆస్కారం ఇవ్వకుండా సులువైన ఎత్తులతోనే ముందుకు సాగాడు. ఆనంద్‌పై పెద్దగా ఒత్తిడి కూడా పెంచలేకపోయాడు. బహుశా గత గేమ్ ప్రభావం నుంచి ఇంకా అతను బయట పడలేదేమో అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే మ్యాచ్ ఆసాంతం ఇద్దరూ సమఉజ్జీలుగానే కనిపించారు. కార్ల్‌సన్‌కు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. అలాగే ఆనంద్ డిఫెన్స్ ఈ గేమ్‌లో బలంగా కనిపించింది. దాంతో ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇదే తరహాలో విషీ ఆడితే ఖచ్చితంగా చాంపియన్ ఒత్తిడిలో పడిపోతాడు. ఈ గేమ్‌లో 40వ ఎత్తు తర్వాత కార్ల్‌సన్‌కు అరుదైన అవకాశం దక్కిందేమో అనిపించింది. అయితే తర్వాతి ఎత్తులో ఆనంద్ క్వీన్‌ను డి2లోకి కదిలించడంతో సమస్య లేకుండా పోయింది. దాంతో మరో ఆరు ఎత్తులకే ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నల్ల పావులతో ఆడి ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడం ఆనంద్‌కు ఎంతో మంచిది. అతనిలో ఆత్మవిశ్వాసం పెరగటంతో పాటు మానసికంగా కూడా ప్రత్యర్థిపై పైచేయి అవుతుంది. విరామం తర్వాతి గేమ్‌లో ఆనంద్ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇదే జోరులో తర్వాతి గేమ్ గెలిస్తే ఇక విషీకి తిరుగుండదు. -
ఆనంద్ పుంజుకుంటాడు
పెంటేల హరికృష్ణ తొలి గేమ్‌లో ఆనంద్కి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎండ్ గేమ్‌లో అది ‘డ్రా'గా వెళ్లింది. కొంచెం దూకుడుగా ఆడి ఉంటే తొలి గేమ్‌లో ఆనంద్ గెలిచేవాడు. రెండో గేమ్‌లో ఆనంద్ బెర్లిన్ డిఫెన్స్‌తో ఆట ప్రారంభించాడు. చెన్నైలో జరిగిన గత చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ నల్ల పావులతో తొలుత ఇదే ఎత్తుతో ఆడాడు. కార్ల్సన్ థియరీలోకి వెళ్లకుండా సైడ్ లైన్ ఎంచుకున్నాడు. దీని ద్వారా ఆనంద్‌ని తన ప్రిపరేషన్స్‌లో నుంచి బయటకు తీసుకెళ్లాలనేది కార్ల్సన్ ఆలోచన. నిజానికి చాలావరకు ఈ గేమ్ సమానంగా సాగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారుడు ఎవరైనా ‘డ్రా’కు అంగీకరించే స్థితిలో గేమ్ ఉన్నప్పుడు... కార్ల్సన్ అద్భుతం చేశాడు. రూక్ని ఎ3కి తీసుకెళ్లి కొత్త ప్రయోగం చేశాడు. ఇది అత్యద్భుతమైన ఆలోచన. దీనిని ఆనంద్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో అక్కడి నుంచి నెమ్మదిగా పట్టు కోల్పోయాడు. కార్ల్సన్ వేసిన ఈ ఒక్క ఎత్తు వల్ల అతనికి గేమ్‌లో అనేక ప్రత్యామ్నాయాలు కనిపించాయి. గతంలో గెల్ఫాండ్‌తో చాంపియన్‌షిప్‌లో ఆనంద్ తొలి గేమ్ ఓడిపోయాడు. కానీ పుంజుకుని టైటిల్ గెలిచాడు. కాబట్టి రెండో గేమ్ ఓటమి ప్రభావం ఆనంద్‌పై ఉండకపోవచ్చు. అయితే ఓడిపోయినప్పుడు సహజంగానే మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయిలో పాత ఫలితాన్ని చూసుకుంటే ముందుకు సాగడం కష్టం. ఇది ఆనంద్కి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మూడో రౌండ్లో ఆనంద్ మళ్లీ నల్లపావులతోనే ఆడతాడు.