ఇది ఆనంద్‌లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది
(పెంటేల హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్)
కార్ల్‌సన్ ఈసారి ఓపెనింగ్‌కు సిసిలియన్ డిఫెన్స్‌ను, ఎప్పటిలాగే సైడ్‌లైన్‌ను ఎంచుకున్నాడు. పెద్దగా అటాకింగ్‌కు ఆస్కారం ఇవ్వకుండా సులువైన ఎత్తులతోనే ముందుకు సాగాడు. ఆనంద్‌పై పెద్దగా ఒత్తిడి కూడా పెంచలేకపోయాడు. బహుశా గత గేమ్ ప్రభావం నుంచి ఇంకా అతను బయట పడలేదేమో అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే మ్యాచ్ ఆసాంతం ఇద్దరూ సమఉజ్జీలుగానే కనిపించారు.
కార్ల్‌సన్‌కు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. అలాగే ఆనంద్ డిఫెన్స్ ఈ గేమ్‌లో బలంగా కనిపించింది. దాంతో ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇదే తరహాలో విషీ ఆడితే ఖచ్చితంగా చాంపియన్ ఒత్తిడిలో పడిపోతాడు. ఈ గేమ్‌లో 40వ ఎత్తు తర్వాత కార్ల్‌సన్‌కు అరుదైన అవకాశం దక్కిందేమో అనిపించింది. అయితే తర్వాతి ఎత్తులో ఆనంద్ క్వీన్‌ను డి2లోకి కదిలించడంతో సమస్య లేకుండా పోయింది.
దాంతో మరో ఆరు ఎత్తులకే ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నల్ల పావులతో ఆడి ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడం ఆనంద్‌కు ఎంతో మంచిది. అతనిలో ఆత్మవిశ్వాసం పెరగటంతో పాటు మానసికంగా కూడా ప్రత్యర్థిపై పైచేయి అవుతుంది. విరామం తర్వాతి గేమ్‌లో ఆనంద్ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇదే జోరులో తర్వాతి గేమ్ గెలిస్తే ఇక విషీకి తిరుగుండదు.