పైచేయి ఎవరిదో!
సోచి (రష్యా): సొంతగడ్డపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విశ్వనాథన్ ఆనంద్... మళ్లీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రపంచ చదరంగంపై పట్టు సాధించాలని మాగ్నస్ కార్ల్‌సన్.... ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య శనివారం ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు తొలి గేమ్‌తో తెరలేవనుంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గే అవకాశం ఇవ్వకుండా కార్ల్‌సన్ నెగ్గినతీరు అందర్నీ అబ్బురపరిచింది.
అదే సమయంలో ఆనంద్ ఓడిన విధానం ఆందోళన కలిగించింది. ఏడాది తిరిగేలోపు మళ్లీ వీరిద్దరూ ప్రపంచ టైటిల్ కోసం సిద్ధమయ్యారు. ఈసారీ కార్ల్‌సన్‌ను ఫేవరెట్‌గా పరిగణిస్తున్నప్పటికీ... ఆనంద్‌ను మాత్రం తక్కువ అంచనా వేయడంలేదు. గత ఏడాది మాదిరిగా ఏకపక్షంగా కాకుండా... ఈసారి పోరు నువ్వా నేనా అన్నట్లు సాగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
{పపంచ చాంపియన్ అయ్యాక... క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి మళ్లీ ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందిన రెండో క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. గతంలో అనతోలి కార్పోవ్ (రష్యా-1987, 1990లో) రెండుసార్లు ఈ విధంగా అర్హత సాధించాడు.
విక్టర్ కార్చునోయ్ తర్వాత పెద్ద వయస్సులో క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన రెండో ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. కార్చునోయ్ 46 ఏళ్లకు (1977లో), ఆనంద్ 44 ఏళ్లకు ఈ టోర్నీని గెలిచారు.
ఏకకాలంలో మూడు ఫార్మాట్‌లలో (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి చెస్ ప్లేయర్‌గా మాగ్నస్ కార్ల్‌సన్ గుర్తింపు పొందాడు.
24 ఏళ్ల తర్వాత అదే ప్రత్యర్థుల మధ్య వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. గతంలో కాస్పరోవ్ (రష్యా), అనతోలి కార్పోవ్ (రష్యా) ఈ విధంగా ఐదుసార్లు (1984, 1985, 1986, 1987, 1990) తలపడ్డారు.
ముఖాముఖి
అన్ని టైమ్ ఫార్మాట్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) లలో కలిపి ఆనంద్, కార్ల్‌సన్ ముఖాముఖిగా 79 సార్లు తలపడ్డారు. క్లాసికల్ ఫార్మాట్‌లో 38 సార్లు పోటీపడగా.. ఆనంద్ ఆరుసార్లు, కార్ల్‌సన్ ఏడుసార్లు గెలిచారు. మిగతా గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి.
వేదిక
2014 వింటర్ ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన రష్యాలోని సోచి పట్టణంలోని ఒలింపిక్ మీడియా సెంటర్.
సమయం
భారత కాలమానం ప్రకారం అన్ని రౌండ్‌ల గేమ్‌లు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి.
గేమ్ జరిగేదిలా...
తొలి 40 ఎత్తులకు 120 నిమిషాలు. ఆ తర్వాత 20 ఎత్తులకు 60 నిమిషాలు. ఆ తర్వాత మరో 15 నిమిషాలు. 61వ ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు అదనంగా 30 సెకన్లు కలుస్తాయి.
{పతి గేమ్ ప్రారంభ సమయానికి కనీసం 10 నిమిషాల ముందే ఇద్దరు ఆటగాళ్లు భద్రత తనిఖీల కోసం వేదిక వద్దకు చేరుకోవాలి.
ఇద్దరు ఆటగాళ్లు 30వ ఎత్తులోపు ‘డ్రా’ కోసం ప్రతిపాదన చేయకూడదు. తప్పనిసరి అయితే చీఫ్ ఆర్బిటర్ అంగీకారంతోనే ఇలా జరగాలి.
గేమ్ సందర్భంగా ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చీఫ్ ఆర్బిటర్ కనిష్టంగా ఐదు వేల యూరోలు జరిమానా విధిస్తారు.