దెబ్బకు దెబ్బ
సోచి (రష్యా): శక్తివంతమైన ప్రారంభం... స్పష్టమైన అం చనా... మంచి సాంకేతికత... శ్రేష్టమైన సమయపాలన.. వెర సి ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి విజయం. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో మంగళవారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మూడో గేమ్‌లో ఆనంద్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. తెల్లపావులతో ఆడుతూ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. నాలుగేళ్ల తర్వాత ఆనంద్ క్లాసిక్ విభాగంలో కార్ల్‌సన్‌పై తొలిసారి గెలిచాడు.
2010 లండన్ క్లాసిక్ టోర్నీలో భాగంగా కార్ల్‌సన్‌పై చివరిసారి 77 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్ ఆ తర్వాత ఈ నార్వే ప్లేయర్‌పై ఈ విభాగంలో నెగ్గలేకపోయాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్, కార్ల్‌సన్ 1.5-1.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నాలుగో గేమ్ బుధవారం జరుగుతుంది. తొలి రెండు గేముల్లో మంచి ఓపెనింగ్ చేసినా స్వయం తప్పిదాలతో తడబడిన ఆనంద్ ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం చేయలేదు. ఒకదశలో ఆనంద్ వేసిన ఎత్తులను కార్ల్‌సన్ అర్థం చేసుకోలేకపోయాడు.