సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో భువీ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో కూడా భువీ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో రెండో వికెట్ తీసిన అనంతరం భువీ.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, భువీ సమంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో 310 టీ20 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో యుజ్వేంద్ర చహల్ (364 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. పియూశ్ చావ్లా (319) రెండో స్థానంలో ఉన్నాడు. భువీ, అశ్విన్ సంయ్తుంగా మూడో స్థానంలో నిలిచారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భువీ (ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్) ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎస్ భరత్, త్రిపురణ విజయ్ వికెట్లు తీశాడు. భువీ బంతితో రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.
157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు. కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment