
టీమిండియా మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి మాలా అశోక్ అంకోలా(77) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పుణెలోని తన ఫ్లాట్‌లో గొంతు కోసి ఉన్న స్థితిలో శవమై కనిపించారు.
మానసిక సమస్యలతో సతమతం
ఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం డీఎస్‌పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. ‘‘మాలా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫ్లాట్‌కి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపుతీయలేదు. దీంతో సమీపంలో నివసించే బంధువులకు సమాచారం ఇచ్చింది.
తలుపు తెరిచి చూడగా మాలా విగతజీవిగా కనిపించారు. ఆమె గొంతు కోసి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ గాయాలు తనకు తాను గానే చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు.
కాగా మాలా అశోక్ అంకోలా గత కొన్నిరోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గిల్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో తనకు తానుగానే గాయపరచుకున్నారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.
అమ్మా.. హృదయం ముక్కలైంది
కాగా సలీల్ అంకోలా అంతర్జాతీయ క్రికెట్‌లో 1989- 1997 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఒక టెస్టు, 20 వన్డేలు ఆడాడు. అనంతరం ఈ ఫాస్ట్‌బౌలర్ పలు హిందీ సినిమాలతో పాటు టీవీ షోలలో నటించాడు. కాగా తల్లి మరణాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అమ్మా’ అంటూ గుండె పగిలినట్లుగా ఉన్న ఎమోజీతో ఆమె ఫొటోను సలీల్ అంకోలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment