
న్యూఢిల్లీ: క్రీడారంగంలో సత్తా చాటి రాజకీయ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఆటగాళ్ల జాబితాలో మరొకరు చేరారు. అయితే ఈ సారి దీనికి మరింత ‘ప్రత్యేకత’ ఉండటం విశేషం. పారాలింపిక్స్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝరియా బీజేపీ పార్టీ తరఫున రాజస్తాన్‌లోని ‘చురూ’ నియోజకవర్గంనుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. పారాలింపిక్స్‌లో 2 స్వర్ణాలు సాధించిన తొలి అథ్లెట్‌గా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు.
2004 ఏథెన్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు గెలిచిన 42 ఏళ్ల దేవేంద్ర 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్నాడు. ‘చురూ’లోనే పుట్టిన అతను ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కే క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో ఎడమ మోచేయి భాగం వరకు పోగొట్టుకున్నాడు. భారత ప్రభుత్వ క్రీడా పురస్కారాలు అర్జున్, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా ఝఝరియా అందుకున్నాడు.