స్నేహ్ రాణా (3/77), హీతర్ నైట్ (95)
తొలి రెండు సెషన్ల పాటు ఇంగ్లండ్‌దే ఆధిపత్యం... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలతో ఆ జట్టు పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ చివర్లో భారత మహిళలకు పట్టు చిక్కింది. 21 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు తీసి ఆతిథ్య జట్టు జోరుకు మిథాలీ సేన అడ్డు కట్టి వేసింది. తొలి సారి ఇంగ్లండ్ సంతృప్తికర స్కోరు సాధించినా...ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన మన అమ్మాయిలు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
బ్రిస్టల్: ఏకైక టెస్టులో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్టు తొలిసారి సమంగా నిలిచాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బుధవారం ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ హీతర్ వైట్ (175 బంతుల్లో 95; 9 ఫోర్లు), టామీ బీమాంట్ (144 బంతుల్లో 66; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్‌కు అన్ని ఫార్మాట్‌లలో కలిపి 100వ మ్యాచ్‌లో నాయకత్వం వహిస్తున్న వైట్ త్రుటిలో సెంచరీ కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణాకు 3, దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి.
కీలక భాగస్వామ్యాలు...
ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు విన్‌ఫీల్డ్ (63 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బీమంట్ శుభారంభం అందించారు. పెద్దగా పదును లేని భారత బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలను వీరిద్దరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఎట్టకేలకు వికెట్ కీపర్ తానియా అద్భుత క్యాచ్‌కు విన్‌ఫీల్డ్ వెనుదిరిగింది. అయితే బీమాంట్, కెప్టెన్ నైట్ అదే జోరును కొనసాగించారు. ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు స్నేహ్, దీప్తిలను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. భారత తుది జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ కూడా లేని లోటు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. కొద్ది సేపటికే బీమంట్ 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం షార్ట్‌లెగ్‌లో ముందుకు దూకుతూ షఫాలీ చక్కటి క్యాచ్ పట్టడం తో బీమాంట్ ఆట ముగిసింది. ఆ తర్వాత వచ్చిన నటాలియా స్కివర్ (75 బంతుల్లో 42; 6 ఫోర్లు) కూడా కెప్టెన్‌కు తగిన సహకారం అందించింది. 115 బంతుల్లో నైట్ హాఫ్ సెంచరీ పూర్తయింది.
మూడు రివ్యూలు...
నిలదొక్కుకున్న స్కివర్‌ను దీప్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే అమీ జోన్స్ (1)ను కూడా రాణా ఇలాగే అవుట్ చేసింది. దీప్తి ఇదే జోరులో నైట్‌ను కూడా ఎల్బీగా పట్టేసింది. ఈ మూడు వికెట్లకు కూడా ఇంగ్లండ్ డీఆర్‌ఎస్ కోరగా...మూడు సార్లు ఫలితం భారత్‌కు అనుకూలంగా రావడం విశేషం. సెంచరీ చేజార్చుకున్న నిరాశలో కెప్టెన్ వెనుదిరగ్గా, ఎల్విస్ (5) ఆమెను అనుసరించింది.
క్యాచ్‌లు మిస్
దురదృష్టవశాత్తూ భారత జట్టు తొలి రోజు పేలవ ఫీల్డింగ్‌ను ప్రదర్శించింది. జులన్ బౌలింగ్‌లో విన్‌ఫీల్డ్ (3 పరుగుల వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను స్మృతి, హర్మన్ బౌలింగ్‌లో సివర్ (స్కోరు 36) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీప్తి వదిలేయగా...26 పరుగుల వద్ద నైట్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను హర్మన్ అందుకోలే కపోయింది. సమన్వయలోపంతో ఒక సునాయాస రనౌట్ చేయడంలో కూడా మన అమ్మాయిలు విఫలమయ్యారు. తీవ్రమైన ఎండ కూడా మహిళలను కొంత ఇబ్బంది పెట్టింది.
ఐదుగురు అరంగేట్రం
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు ప్లేయర్లు తొలిసారి టెస్టు క్రికెట్ బరిలోకి దిగారు. దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియాలకు ఆ అవకాశం దక్కింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: విన్‌ఫీల్డ్ (సి) తానియా (బి) పూజ 35, బీమాంట్ (సి) షఫాలీ (బి) రాణా 66, హీతర్ నైట్ (ఎల్బీ) (బి) దీప్తి 95, స్కివర్ (ఎల్బీ) (బి) దీప్తి 42, జోన్స్ (ఎల్బీ) (బి) రాణా 1, డంక్లీ (బ్యాటింగ్) 12, ఎల్విస్ (సి) దీప్తి (బి) రాణా 5, బ్రంట్ (బ్యాటింగ్) 7, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (92 ఓవర్లలో 6 వికెట్లకు) 269.
వికెట్ల పతనం: 1–69, 2–140, 3–230, 4–236, 5–244, 6–251.
బౌలింగ్: జులన్ గోస్వామి 18–2–44–0, శిఖా పాండే 11–3–36–0, పూజ వస్త్రకర్ 12–3–43–1, స్నేహ్ రాణా 29–4–77–3, దీప్తి శర్మ 18–3–50–2, హర్మన్ ప్రీత్ 4–0–16–0.
Comments
Please login to add a commentAdd a comment