పారిస్: అంతా అనుకున్నట్లు జరిగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా సొంతమయ్యే పరిస్థితుల్లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సబలెంకా రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ ప్లేయర్ మార్టా కోస్టుక్‌తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సబలెంకా 6–3, 6–2తో గెలిచింది.
71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 19 విన్నర్స్ కొట్టిన సబలెంకా 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–5తో సాకరిని ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముకోవా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా), 13వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) తమ ప్రత్యర్థులపై కష్టపడి గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సిట్సిపాస్ 7–5, 6–3, 4–6, 7–6 (9/7)తో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై, రుబ్లెవ్ 6–1, 3–6, 6–3, 6–4తో జెరె (సెర్బియా)పై, హుర్కాజ్ 6–3, 5–7, 4–6, 2–6, 6–4తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, ఖచనోవ్ 3–6, 1–6, 6–2, 6–1, 6–3తో లెస్టిన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment