బ్యాటింగ్‌లో నిలకడ, షాట్లలో కచ్చితత్వం, క్రీజులో నిలిస్తే చక్కని ఇన్నింగ్స్‌లు ఆడగలిగే నేర్పరితనం... ఇవన్నీ ఆ అమ్మాయి సొంతం. మిథాలీ రాజ్ తర్వాత జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా తనలో ఉందని ఆటద్వారా చాటి చెప్పుకుంటున్న టీనేజ్ సెన్సేషన్ గొంగడి త్రిష, తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష ఆదివారం మలేసియాలో ముగిసిన ఆసియా అండర్–19 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు కీలకపాత్ర పోషించింది.
దొరై రాజ్ (మిథాలీ రాజ్), హర్మేందర్ సింగ్ భుల్లర్ (హర్మన్‌ప్రీత్ కౌర్), శ్రీనివాస్ మంధాన (స్మృతి), ఇవాన్ రోడ్రిగ్స్ (జెమీమా), సంజీవ్ వర్మ (షఫాలీ వర్మ) వీరంతా తమ గారాల తనయల కోసం తపించారు. భారత్ క్రికెట్‌లో భాగమయ్యేందుకు కుమార్తెలతో పాటు కలలు కని శ్రమించి సాధించారు. వీరిలాగే తెలంగాణకు చెందిన గొంగడి రామిరెడ్డి కూడా తన ఒక్కగానొక్క బిడ్డ (త్రిష) కోసం పుట్టిన గడ్డ (భద్రాచలం)ను వీడి హైదరాబాద్ వచ్చారు.
క్రికెట్లో ఓనమాలు మొదలు అకాడమీలో శిక్షణ కోసం తన స్తోమతకు మించే ఖర్చు చేశారు. తండ్రి కష్టం చూసిన తనయ త్రిష ఆ కళ్లలో ఆనందం నింపాలని నెట్స్‌లో సాధన చేసింది. క్రికెట్‌లో రాటుదేలింది. మైదానంలో రాణిస్తోంది. తాజాగా కౌలాలంపూర్‌లో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఆసియా అండర్–19 మహిళల టి20 టోర్నీ ఫైనల్లో త్రిష (47 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టి భారత జట్టును విజేతగా నిలిపింది.
అంతేకాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు సొంతం చేసుకుంది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్–19 మహిళల తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులోనూ త్రిష సభ్యురాలిగా ఉంది. భద్రాచలంలో ఓ ఫిట్‌నెస్ ట్రెయినర్‌గా పనిచేసే రామిరెడ్డి తన కుమార్తెను అంతర్జాతీయ క్రికెటర్‌గా చూడాలనుకున్నారు. అందుకు భద్రాచలంలో ఉంటే సరిపోదని గుర్తించిన వెంటనే 2013లో సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లికి మకాం మార్చారు.
అక్కడ్నుంచి కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లడం... ఆమె ఆటపై పట్టుదల కనబరచడం, క్రమంగా ప్రతిభగల క్రికెటర్‌గా మారడం సజావుగా జరిగిపోయాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న డబ్ల్యూపీఎల్ వేలమే ఆ తండ్రిని కాస్త నిరాశపరిచింది. క్రితంసారి మెగా వేలంలో అన్‌సోల్డ్ క్రికెటర్‌గా మిగిలిపోవడం... ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ ఫ్రాంచైజీలు త్రిషను మరోసారి విస్మరించడంతో నిరుత్సాహం కలిగింది. అయితే త్రిష నిలకడగా ఆడుతున్న తీరును బట్టి భవిష్యత్‌లో ఆమెపై ఫ్రాంచైజీలు తప్పకుండా దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదు.
హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆమె అచిరకాలంలోనే పిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర అండర్–19 జట్టు తరఫున స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీల్లో రాణించిన ఆమె కీలక బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించింది. 2014–15 సీజన్‌లో హైదరాబాద్ అండర్–19 తరఫున ఇంటర్ స్టేట్ టోర్నమెంట్‌లో పాల్గొంది. అక్కడి నుంచి హైదరాబాద్, సౌత్‌జోన్ అండర్–19 జట్లలో రెగ్యులర్ ప్లేయర్‌గా మారింది.
గత రెండేళ్లుగా భారత అండర్–19 జట్టులో ఓపెనర్‌గా రాణిస్తోంది. టాపార్డర్ బ్యాటర్ అయిన త్రిష లెగ్‌స్పిన్ బౌలర్ కూడా! క్రమం తప్పకుడా బౌలింగ్ కూడా వేస్తుంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తుదిపోరులో వికెట్ తీయకపోయినా (3–0–10–0)తో కుదురుగా బౌలింగ్ చేసింది.
2023లో అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న త్రిష దురదృష్టవశాత్తూ మహిళల ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కంటబడటం లేదు. గతేడాది ఆమెను మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. మొన్న మినీ వేలంలోనూ విస్మరించారు. అయినా... త్రిష నిరాశలో కూరుకుపోలేదు. తనపని తాను చేసుకుపోతోంది. రైజింగ్ స్టార్‌గా ఎదుగుతున్న త్రిష హైదరాబాద్ నుంచి మరో మిథాలీ రాజ్ కావాలని ఆశిద్దాం.
– సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment