సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–16 స్కూల్, కాలేజీ టోర్నమెంట్‌లో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో గౌతమ్ కాలేజి 71 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జట్టుపై గెలిచింది. తొలుత గౌతమ్ కాలేజి 50 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి (74 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బిడిగుల బాలాజీ (46; 5 ఫోర్లు), రిషభ్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ వఫీ కచ్చి (119 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. గౌతమ్ కాలేజీ బౌలర్లలో బాలాజీ మూడు, రుతీష్ రెడ్డి రెండు, రవికుమార్ రెండు వికెట్లు తీశారు. గౌతమ్ కాలేజి జట్టు లెగ్ స్పిన్నర్ డి.మనీశ్ ఓవరాల్‌గా 14 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment