పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. ఐపీఎల్-2025 మెగా వేలం జరిగే రోజే.. పంత్ ఇలా విఫలం కావడంతో నెట్టింట అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. రిషభ్ పంత్(37), నితీశ్ రెడ్డి(41) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగలిగింది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. ఆసీస్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. భారీ లీడ్‌తో ముందుకు సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జైస్వాల్ భారీ శతకం(161) సాధించగా.. రాహుల్ సూపర్ హాఫ్ సెంచరీ(77)తో మెరిశాడు.
వీరిద్దరి భారీ భాగస్వామ్యం కారణంగా టీమిండియా పెర్త్ టెస్టులో పట్టుబిగించింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(25) కాస్త ఫర్వాలేదనిపించగా.. పంత్ మాత్రం నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడేందుకు క్రీజును వీడిన పంత్.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
లియాన్ పన్నిన స్పిన్ మాయాజాలన్ని సమర్థవంతంగా ఛేదించలేక.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఆదివారం ఐపీఎల్ మెగా వేలం పాట మొదలుకానుంది. రెండురోజుల పాటు నిర్వహించే ఆక్షన్‌లో కళ్లన్నీ పంత్ మీదే ఉన్నాయి.
ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ అత్యధిక ధరకు అమ్ముడుపోతాడనే అంచనాల నడుమ.. ఇలా వికెట్ పారేసుకోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇక ఓపెనర్లతో పాటు విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తుండటంతో పెర్త్ టెస్టులో టీమిండియా నాలుగు వందలకు పైగా ఆధిక్యంతో.. మరింత పట్టుబిగించే దిశగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment