
ధోని (PC: IPL/CSK)
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే).. మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేర్లు పర్యాయపదాల్లాంటివి అనడం అతిశయోక్తి కాదు. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే ఉన్నాడు. పదిహేడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. వేలం మొదలు కెప్టెన్‌గా తుదిజట్టు ఎంపిక దాకా ప్రతీ విషయంలోనూ ధోని మార్కు కనబడుతుంది.
ఎంతో మంది యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చి.. వారిలోని ప్రతిభకు పదునుపెట్టేలా మార్గదర్శనం చేశాడు ధోని. శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీశ పతిరానా వంటి వాళ్లు అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదగడంలో ‘తలా’ పాత్ర ఉందని చెప్పడం ఇందుకు నిదర్శనం. ఇక ‘డాడీ’స్ గ్యాంగ్(సీనియర్ ఆటగాళ్లు)తోనూ ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ధోని.. ఐపీఎల్-2022లోనే తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు.
సీఎస్‌కే పగ్గాలు అతడికి అప్పగించి తాను ప్లేయర్‌గా కొనసాగాలని భావించాడు. అయితే, ధోని తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వలేదు. అంతకుముందు కెప్టెన్‌గా అనుభవం లేని జడ్డూ దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వదిలేసి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోని మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టు అవమానకరరీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఫలితంగా మరుసటి ఏడాది ధోనినే కెప్టెన్‌గా కొనసాగాడు. ఐపీఎల్-2023లో సీఎస్‌కేకి ఐదో టైటిల్ అందించాడు. ఈ క్రమంలో అతడు ఇక ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా ఐపీఎల్-2024లోనూ ‘తలా’ భాగమయ్యాడు. ఈసారి రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.. చెన్నై మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచినా నెట్‌రన్ రేటు పరంగా వెనుకబడి టాప్-4 నుంచి నిష్క్రమించింది.
అయితే, ఈ సీజన్‌లో 42 ఏళ్ల ధోని మోకాలి నొప్పితోనే మ్యాచ్‌లు ఆడాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తూ బ్యాటర్‌గానూ తనదైన ముద్ర వేశాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ధోని చెన్నై ప్లేయర్‌గా కొనసాగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆటగాళ్ల రిటెన్షన్ విధానం విషయంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ మధ్య జూలై 31న సమావేశం జరుగనున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకు ఒకవేళ ఐదుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తేనే ధోని ఆటగాడిగా కొనసాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సంఖ్య నాలుగుకే పరిమితమైతే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరానా, శివం దూబేలను చెన్నై రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ విషయం గురించి ధోని ఇప్పటికే చెన్నై ఫ్రాంఛైజీ యజమాని ఎన్.శ్రీనివాసన్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోని.. చెన్నై మెంటార్‌గా కనిపించనున్నాడని క్రిక్‌బజ్ అంచనా వేసింది. చెన్నై జట్టు ముఖచిత్రమైన ధోని మెంటార్ లేదంటే కోచ్ రూపంలో తిరిగి వస్తాడని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment