కూతురితో షమీ వీడియో.. హసీన్‌ జహాన్‌ ఘాటు వ్యాఖ్యలు | Just For Sake Of Showing Off: Hasin Jahan on Shami Reuniting With their Daughter | Sakshi
Sakshi News home page

కూతురితో షమీ వీడియో.. హసీన్‌ జహాన్‌ ఘాటు వ్యాఖ్యలు

Published Fri, Oct 4 2024 2:49 PM | Last Updated on Fri, Oct 4 2024 3:46 PM

Just For Sake Of Showing Off: Hasin Jahan on Shami Reuniting With their Daughter

టీమిండియా సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీపై హసీన్‌ జహాన్‌ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కేవలం ప్రచార యావతోనే తన కుమార్తెను షాపింగ్‌మాల్‌కు తీసుకువెళ్లాడని.. అంతే తప్ప అతడికి కూతురిపై ప్రేమ లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా 2014లో షమీ హసీన్‌ జహాన్‌ అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు.

వీరికి 2015లో కూతురు జన్మించగా ఐరా అని నామకరణం చేశారు. అయితే, కొన్నాళ్లకు షమీ- హసీన్‌ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో తన భర్త వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించిన హసీన్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, గృహహింసకు పాల్పడ్డాడంటూ అతడిని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో షమీకి ఊరట దక్కింది.

2018 నుంచి షమీ- హసీన్‌ విడివిడిగానే
ఈ నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్‌ విడివిడిగానే ఉంటున్నారు. కుమార్తె ఐరా తల్లి వద్దనే పెరుగుతోంది. ఈ క్రమంలో షమీ తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ‘‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తనను కలిసేంత వరకు కాలం ఇలాగే గడుస్తుంది. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను బెబో’’ అంటూ షమీ తన కుమార్తెను హత్తుకుని ఉన్న దృశ్యాలను షేర్‌ చేశాడు. ఇందులో అతడు ఐరాను షాపింగ్‌కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. కూతురికి దూరంగా ఉండటం నరకమంటూ షమీ పట్ల నెటిజన్లు సానుభూతి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హసీన్‌ జహాన్‌ తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘‘ఇదంతా కేవలం షో ఆఫ్‌ కోసమే. నా కూతురు పాస్ట్‌పోర్టు గడువు ముగిసింది.

అందుకే ఐరాను అక్కడకు తీసుకువెళ్లాడు
కొత్త పాస్‌పోర్టు కావాలంటే షమీ సంతకం అవసరం. అందుకే ఐరా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. అయితే, అతడు మాత్రం సంతకం చేయనేలేదు. నా కూతురిని తీసుకుని షాపింగ్‌ మాల్‌కు వెళ్లాడు. ఆ కంపెనీకే షమీ ప్రచారకర్తగా ఉన్నాడు.

ఆ షాపులో నా కూతురికి షూస్‌, బట్టలు కొనిచ్చాడు. వాటికి అతడు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకే ఐరాను అక్కడకు తీసుకువెళ్లాడు. నా కూతురు తనకు గిటార్‌, కెమెరా కావాలని అడిగింది. కానీ.. అతడు వాటిని కొనివ్వనేలేదు.

అతడు నా కూతురు గురించి ఎప్పుడూ ఆలోచించడు. గత నెలలో కూడా ఐరాను కలిశాడు. కానీ అప్పుడు ఇలాంటి వీడియోలేవీ షేర్‌ చేయలేదు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడు’’ అని హసీన్‌ జహాన్ పేర్కొన్నట్లు ఆనంద్‌బజార్‌.కామ్‌ తెలిపింది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత చీలమండ నొప్పితో టీమిండియాకు దూరమైన షమీ ఇంకా రీఎంట్రీ ఇవ్వలేదు.

చదవండి: IND VS BAN 1st T20: వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement